కొద్ది రోజులుగా పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘గజ’ తుపాను నేడు తీరం దాటనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తుపాను చెన్నైకి ఆగ్నేయంగా 370 కిలోమీటర్లు, నాగపట్నానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరో 6 గంటల్లో తీవ్ర తుపానుగా బలపడి సాయంత్రానికి పంబన్-కడలూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాతో పాటు ఉత్తర తమిళనాడులోని ఏడు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.తుపాను తీరం దాటే సమయంలో కడలూరు, నాగపట్టణం, కారైక్కాల్, తిరువారూరు, తంజావూరు, పుదుకోట, రామనాథపురం జిల్లాలలో గంటకు 80 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. చెన్నైలో మాత్రం రానున్న మూడు రోజులు మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.తుపాను ముందస్తు చర్యల్లో భాగంగా కడలూరు, నాగై, తిరువారూరు, రామనాథపురం, పుదుకోట, కారైక్కాల్ జిల్లాల్లోని విద్యా సంస్థలకు గురువారం సెలవు ప్రకటించారు. పుదుచ్చేరిలో తీరప్రాంతాలలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాల్లోని పాఠశాల, కమ్యూనిటీ హాళ్లకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి అవసరమయ్యే ఆహారం, తాగునీరు తదితర వసతులు కల్పిస్తున్నారు.గజ తుపాను తమిళనాడులోని తీర ప్రాంతాల్లో అధిక ప్రభావం చూపనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తూర్పు నావికాదళం అప్రమత్తమైంది. దీంతో సముద్ర తీరంలో యుద్దనౌకలను మోహరించింది. ఐఎన్‌ఎస్ రణ్‌వీర్, కంజార్ యుద్ధ నౌకలతో పాటు హెలికాప్టర్లను సిద్ధం చేసింది. తుపాను బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, వారికి వైద్య సేవలు, వస్తువులు, ఆహారం పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.