తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి కాంగ్రెస్, టీడీపీలు జట్టు కట్టడం ఆ రెండు పార్టీల అధిష్టానాలకు తీవ్ర తనొప్పిగా మారింది. ఈ ఎన్నికల్లో పోటీ కోసం వేచి చూస్తోన్న కాంగ్రెస్, టీడీపీ ఆశావాహులు తమకు సీట్లు రాకపోవడంపై ఇప్పటికే ఆందోళనలకు దిగుతున్నారు. మహాకూటమిలోని కాంగ్రెస్, టీడీపీ సర్దుబాట్ల కారణంగా సీట్లు కోల్పోయినవారు రెబల్స్‌గా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. మరికొందరు సీట్ల కోసం గాంధీ భవన్, ఎన్టీఆర్ భవన్ల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లోనే ఉన్న ఈ ఆందోళనలు ఇప్పుడు అమరావతికి చేరాయి. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సీటు తనకే కేటాయించాలని కోరుతూ సామ రంగారెడ్డి అమరావతిలో ఆందోళనకు దిగారు. అనుచరులతో కలిసి రంగారెడ్డి అమరావతి వెళ్లారు. గురువారం ఉదయం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ప్రయత్నించారు. సామ విషయంపై చంద్రబాబుతో మాట్లాడేందుకు పార్టీ సీనియర్ నేత నామా నాగేశ్వర్‌రావు రంగంలోకి దిగారు. చంద్రబాబుతో భేటీ అయి చర్చించారు. కానీ, ఎల్బీనగర్ సీటు రంగారెడ్డికి ఇవ్వడం కుదరదని చంద్రబాబు తేల్చి చెప్పారు. పరిస్థిని అర్థం చేసుకోవాలని సూచించారు. అన్నీ ఆలోచించే రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం సీటు కేటాయించినట్లు తెలిపారు. అధినేతతో చర్చల అనంతరం సామ రంగారెడ్డిని బుజ్జగించేందుకు నామా నాగేశ్వరరావు ప్రయత్నించారు. అయితే ఎల్బీనగర్ టీడీపీ కార్యకర్తలు మాత్రం రంగారెడ్డికి సీటు కేటాయించాల్సిందే అని ఆందోళన చేపట్టారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాస్తవానికి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన బీసీ నేత ఆర్.కృష్ణయ్య విజయం సాధించాడు. అప్పుడు మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్‌రెడ్డికి ఇప్పుడు మహా కూటమి తరఫున ఎల్బీనగర్ టిక్కెట్ ఇచ్చారు. దీంతో, టీడీపీకి మంచి పట్టున్న ఎల్బీనగర్ నియోజకవర్గంలో నామ రంగారెడ్డికే సీటు కేటాయించాలని పార్టీ కార్యకర్తలు పట్టుబడుతున్నారు. తనకు ఇబ్రహీంపట్నం సీటు కేటాయిస్తే 15 రోజుల్లో ఎలా ప్రచారం చేసుకోగలమని రంగారెడ్డి ప్రశ్నిస్తున్నారు.