జనసేన ఉన్నది మార్పు కోసమేనని.. అధికారం కోసం కాదని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. కాకినాడ ఓడరేవులో జరుగుతున్న అక్రమాలు, పర్యావరణ విధ్వంసక చర్యలను అంతర్జాతీయ సమాజం కళ్లకు కడతామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జీ కన్వెన్షన్ హాలు పవన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మత్స్యకారులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని... వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాకినాడ తీరంలో సహజసిద్ధంగా ఏర్పడిన హోప్ ఐలాండ్‌ను అక్రమంగా తవ్వేసినా అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. విశాఖలోని మెలోడి థియేటర్ యజమాని కేవీ రావు రూ.వేల కోట్లు ఎలా వెనకేశారని ప్రశ్నించారు. సాధారణ థియేటర్ యజమాని ఇప్పుడు అమెరికా పౌరుడు ఎలా అయ్యారని నిలదీశారు. కేవీ రావు చేస్తున్న అక్రమాలపై ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేస్తానన్నారు. అతడిని వెంటనే దేశానికి రప్పించి ప్రశ్నించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అవసరానికి మించి భూములు తీసుకోవడం వల్లే ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లు విఫలమయ్యాయని పవన్ అన్నారు. సెజ్‌లను రద్దు చేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు. కాకినాడ సెజ్‌పై పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. కాకినాడ నుంచి వేల టన్నుల పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలిపోతోందని పవన్ ఆరోపించారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సంయుక్త కలెక్టర్ నేరుగా దాడి చేసి పట్టుకున్నారని పవన్ తెలిపారు.