YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

22న ధర్మ పోరాట దీక్ష తర్వాత యాక్షన్ ప్లాన్

22న ధర్మ పోరాట దీక్ష తర్వాత యాక్షన్ ప్లాన్
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలను ఏకం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏన్‌డీఏలో చీలికపై దృష్టి సారించనున్నట్లు  సమాచారం. వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే పార్టీలతో ఇప్పటికే మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మిగతా పార్టీల నేతలతో రానున్న రోజుల్లో చర్చలు జరుపనున్నట్లు సమాచారం. డిసెంబర్ 22 తరువాత బాబు తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తారని టీడీపీకి చెందిన ఒక ముఖ్యనేత తెలిపారు. చంద్రబాబు ఇప్పటికే రెండు దఫాలుగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై పర్యటనల్లో సుమారు 15 రాజకీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి బీజేపీకి వ్యతిరేకంగా వారి మద్దతు కూడగట్టగలిగారు. ఇవే గాక యూపీఏలో ఉన్న మరికొన్ని పార్టీలు సైతం తమ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.వీటికితోడు ఎన్‌డీఏలోని పార్టీలను ఆ కూటమి నుంచి బయటకు తీసుకువచ్చి కొత్తగా ఏర్పడే కూటమిలో భాగస్వామ్యం చేసే విషయంపై చంద్రబాబు దృష్టి సారించనున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్‌డీఏలో ప్రస్తుతం 45 పార్టీలు భాగస్వామ్యులుగా ఉన్నాయి. వాటిలో 11 పార్టీలకు మాత్రమే లోక్‌సభలో ప్రాతినిధ్యం ఉంది. ఇందులో ఇప్పటికే ఇద్దరు నేతలు బాబుతో చర్చించారని, కొత్త కూటమిలో చేరడానికి తమకు అభ్యంతరం లేదని చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని ఆరోపిస్తూ చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షలు మరిన్ని జిల్లాల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 20న నెల్లూరు, 27న విజయనగరంలో సభలు నిర్వహించనున్నారు. అనంతపురంలో సైతం సభ నిర్వహించి ఆ తరువాత తెలంగాణ ఎన్నికలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.అమరావతిలో డిసెంబర్ 22న ధర్మ పోరాట దీక్ష చేపట్టి ఆ దీక్షకు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అదేరోజు కొత్త కూటమిలో భాగస్వాములు కావాలనుకుంటున్న పార్టీల నాయకులతో అమరావతిలోనే సమావేశం నిర్వహించి తదుపరి కార్యక్రమాన్ని రూపొందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత చంద్రబాబు తమిళనాడులో కొత్తగా రాజకీయ పార్టీలు ఏర్పాటుచేసిన సినీనటులు రజనీకాంత్, కమల్‌హాసన్‌తో సైతం చర్చించనున్నట్లు సమాచారం. కాగా డిసెంబర్‌లో జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తే ఎన్డీయేలో చీలిక తథ్యమని బాబు గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని 
ఓడించడం మరింత సులువవుతుందని ఆయన విశ్వాసంతో ఉన్నట్లు సమాచారం

Related Posts