కమ్యూనిస్టులు జనసేన అధినేత పవన్ తొ పొత్తుపెట్టుకొని కలసి పోరాటాలు సాగించాలని చాలాకాలంగా కలలు కంటున్నారు. అయినా అవి వాస్తవ రూపం దాల్చడం లేదు. మరోవైపు కమ్యూనిస్టు నేతలు తెలంగాణలో తమ రాజకీయ పోరాటాలను ఎవరికివారే అన్నట్లు సాగిస్తున్నారు. సీపీఐ… టీడీపీ, కాంగ్రెస్, టీజేఏస్‌లతో కలిసి మహాకూటమిగా ఏర్పడిన విషయం విదితమే. అయితే సీపీఎం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనే కూటమిని ఏర్పాటు చేసుకుని విడిగా బరిలోకి దిగుతోంది. జనసేనను ఈ కూటమిలోకి ఆహ్వానించినప్పటికీ ఇప్పటికీ స్పందన రాలేదని తెలుస్తోంది. పవన్ తో పొత్తు కోసం సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎంతగానో ప్రయత్నించారు. అయితే పవన్ తనను కలుసుకునే అవకాశాన్ని తమ్మినేని వీరభద్రానికి ఇవ్వలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగా తెలంగాణలో పవన్ తో పొత్తు విషయం మరుగున పడిందంటున్నారు. అయితే తాజాగా ఏపీలో పవన్ తో పొత్తులపై కమ్యూనిస్టులు చర్చిస్తున్నారని సమాచారం. జాతీయ రాజకీయాలతో పాటు తెలంగాణలో పవన్ తో పొత్తు ఎలావున్నా ఏపీలో పొత్తువుంటుందని వామపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో మాదిరిగా ఏపీలోని కమ్యూనిస్టు నేతలు సీపీఐ, సీపీఎం అంటూ విడివిడిగా పోరాటాలు చేయడం లేదట. కలిసే ముందుకు సాగుతున్నారని సమాచారం.సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణ ఏపీలో కలసిమెలసి తిరుగుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో జత కట్టే
ప్రయత్నం చేస్తున్నారని భోగట్టా. అయితే పవన్ కమ్యూనిస్టులను అంతగా పట్టించుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మొదట్లో పవన్ కూడా కమ్యూనిస్టుల గురించి ప్రస్తావించేవారు. పైగా కమ్యూనిస్టులతో భేటీ అయ్యాక పోరాట ప్రణాళిక సిద్దం చేసుకుంటామనేవారు. ఈ నేపధ్యంలో మొదట్లో కొన్ని కార్యక్రమాలు కలిసి నిర్వహించారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కమ్యూనిస్టుల్ని పట్టించుకోవడం మానేశారనే టాక్ వినిపించింది. వామపక్షాలు ఏ కార్యక్రమం నిర్వహించినా పవన్ కల్యాణ్ ను పిలుస్తున్నప్పటికీ ఆయన హాజరుకావడం లేదని సమాచారం. మరోవైపు జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా కమ్యూనిస్టు పార్టీలే వాటికి హాజరవుతున్నయట. దీనికి తోడు ఆ మధ్య వామపక్షాలు ఓ ప్రత్యామ్నాయ వేదిక తీసుకువస్తామని, దానిలో పవన్ కల్యాణే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించిన విషయం విదితమే. అయినా వారి మాటలకు పవన్ స్పందించలేదని సమాచారం. అయినా కమ్యూనిస్టు పార్టీ నేతలు పవన్ పై ఆశలు వదులుకోవడం లేదట. ఇంత జరుగుతున్నా పవన్ కల్యాణ్ స్పందించకపోవడం విచిత్రమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.