కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)పై ఇటీవల వచ్చిన అభియోగాలు, అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలోనే ఆ సంస్థకు ఇచ్చిన ‘సమ్మతి’ ఉత్తర్వులను రద్దు చేశామని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో ఏ కేసు విచారణలో అయినా సీబీఐ ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సీబీఐపై ఆరోపణల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై సీబీఐ ప్రతీ కేసులోనూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరన్నారు. ఇప్పటికే కర్ణాటక లాంటి రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని...ఈ విషయంలో కేంద్రానికి భయపడే ప్రసక్తే లేదని హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. సిబిఐ విచారణకు సంబంధించి గతంలో ఇచ్చిన అనుమతులను వెనక్కు తీసుకున్నామని అన్నారు. సీబీఐపై తమకు ఇప్పటికీ విశ్వాసం ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు. మేధావుల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఈ నిర్ణయం తీసుకున్నామన్న వాదనలను ఆయన ఖండించారు. సీబీఐ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఓ ఆయుధంగా మారిపోయిందని హోంమంత్రి విమర్శించారు. ప్రతి కేసులోనూ సిబిఐ ముందస్తు అనుమతి కోరితే ఇస్తామని ఆయన అన్నారు.