చిత్రం: అమర్ అక్బర్ ఆంటొని
నటీనటులు: రవితేజ, ఇలియానా, వెన్నెల కిశోర్, సునీల్, షాయాజీ షిండే, లయ, శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి, తనికెళ్ల భరణి, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సత్య, భరత్ రెడ్డి, రవిప్రకాశ్, ఆదిత్య మేనన్ తదితరులు
సంగీతం: ఎస్‌ఎస్ తమన్
కూర్పు: ఎంఆర్ వర్మ
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనువైట్ల
విడుదల తేదీ: 16-11-2018
రవితేజ సినిమా అనగానే మొదట గుర్తుకొచ్చేది హాస్యమే. దర్శకుడు శ్రీనువైట్లదీ అదే పంథానే. మాస్ అంశాలు ఎన్ని ఉన్నా నవ్వించడం మాత్రం మరిచిపోరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన దుబాయ్ శీను, వెంకీ చిత్రాలు మంచి వినోదాన్ని పండించాయి. విజయవంతమైన ఈ కలయికలో వచ్చిన నాలుగో చిత్రమే ‘అమర్ అక్బర్ ఆంటొని’. ఇలియానా ఆరేళ్ల తర్వాత ఈ చిత్రంతో పునః ప్రవేశం చేసింది. ఇందులో రవితేజ మూడు అవతారాల్లో సందడి చేయబోతున్నాడని పేరు, ప్రచార చిత్రాలు చూస్తేనే అర్థమవుతోంది. మరి ‘అమర్ అక్బర్ ఆంటొని’ల కథేమిటి? రవితేజ, శ్రీనువైట్ల కలిసి ఏ స్థాయిలో నవ్వించారు?
కథేంటంటే: అమెరికాలో స్థిరపడ్డ రెండు తెలుగు కుటుంబాలు ఒకటిగా జీవిస్తుంటాయి. వారు కలిసి చేస్తున్న వ్యాపార సంస్థలోని నలుగురు ఉద్యోగుల్ని కూడా వాటాదారులుగా చేర్చుకుంటారు. ఆ నలుగురూ వాటాలతో సంతృప్తి పడకుండా, మొత్తం వ్యాపార సంస్థపైనే కన్నేస్తూ ఆ రెండు కుటుంబాల్ని అంతం చేస్తారు. ఆ కుటుంబాలకి చెందిన అమర్ (రవితేజ), ఐశ్వర్య (ఇలియానా)లు మాత్రం తప్పించుకుంటారు. చిన్నప్పుడే చెరో దిక్కున వెళ్లిపోయినా... ఇద్దరూ తమ కుటుంబాల్ని అంతం చేసిన ఆ నలుగురిపై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా బతుకుతుంటారు. మరి ఆ నలుగురిపై అమర్, ఐశ్వర్య ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు? అమర్‌కి, అక్బర్, ఆంటొనీ వ్యక్తులకీ మధ్యనున్న సంబంధం ఏంటి? అసలు వాళ్లెవరు? అమర్, ఐశ్వర్యలు మళ్లీ ఎలా కలిశారనేది తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే: ఇదొక ప్రతీకార కథ. దానికి డిసోసియేటివ్ ఐడెంటిటీ అనే రుగ్మతని జోడించి డ్రామాని పండించే ప్రయత్నం చేశారు. ఉన్నట్టుండి తాను చూసిన వ్యక్తుల్లా మారిపోవడం, మళ్లీ అందులో నుంచి బయటికి రావడమనేదే ఈ రుగ్మత లక్షణం. ఆ సమస్యతో బాధపడుతున్న కథానాయకుడు దాన్ని అధిగమించి తను అనుకున్నది ఎలా సాధించాడనేదే ఈ చిత్రం. సినిమా ఆరంభంలోనే ఇదొక ప్రతీకార కథ అని తెలిసిపోతుంది. ఆ తర్వాత అక్బర్, ఆంటొనిల పాత్రలు వచ్చి వెళ్లే విధానమే ఆసక్తిని రేకెత్తిస్తుంది. తొలి సగభాగం సినిమా అంతా కూడా అమర్, అక్బర్, ఆంటొనిలుగా రవితేజ చేసే అల్లరి, హోల్ ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్ (వాటా) నిర్వాహకులుగా వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, గిరి, రఘుబాబు చేసే హంగామాతో సరదాగా సాగుతుంది. వాళ్లకి శిష్యుడినంటూ సత్య కూడా తోడవుతారు. శ్రీనువైట్ల తన మార్క్ వ్యంగ్యంతో సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. అయితే ఆ సన్నివేశాలు అక్కడక్కడా పండాయంతే.
అసలు కథ ద్వితీయార్ధంలోనే ఉంటుంది. అక్బర్, ఆంటోనీలతో పాటు, డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్‌కి సంబంధించిన వివరాలు వెల్లడి కావడంతో కథ కాస్త ఆసక్తిగా మారుతుంది. ద్వితీయార్ధంలోనే బాబీగా సునీల్ రంగంలోకి దిగుతాడు. దాంతో సన్నివేశాలు సరదా సరదాగా సాగుతాయి. ఆదిత్య మేనన్‌ని చంపే సన్నివేశాలు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తాయి. పతాక సన్నివేశాల్లో మాత్రం బలం లేదు. ఇదొక ప్రతీకార కథ అని ముందే తేలిపోవడంతో అంతా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సన్నివేశాలు సాగిపోతుంటాయి. కథ నేపథ్యం కొత్తగా ఉన్నా... కథనం విషయంలో మాత్రం కొత్తదనం లేదు.
ఎవరెలా చేశారంటే: అమర్, అక్బర్, ఆంటొనిలుగా రవితేజ మూడు కోణాల్లో సాగే పాత్రలో ఆకట్టుకుంటాడు. ఇలా కనిపిస్తూ వినోదం పండించడం ఆయనకి కొట్టినపిండే. అక్బర్ పాత్రలో ఆయన చేసే సందడి వినోదాన్ని పండిస్తుంది. ఇలియానా పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. రెండు పాటల్లో అందంగా కనిపిస్తుందంతే. ప్రతినాయకులు నలుగురు ఉన్నప్పటికీ ఆ పాత్రల్లో ఏమాత్రం బలం లేదు. ఎఫ్.బి.ఐ ఆఫీసర్ అభిమన్యు సింగ్‌గా నటించిన షాయాజీషిండే.... అమర్, ఐశ్వర్యల కుటుంబానికి నమ్మిన బంటుగా కనిపిస్తారు. సునీల్, వెన్నెలకిషోర్, సత్య, రఘుబాబు, గిరి తదితర కామెడీ గ్యాంగ్ పరిధి మేరకు నవ్వించింది.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సినిమా అంతా అమెరికాలోనే సాగుతుంది. తమన్ సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. క్లైమాక్స్‌కి ముందు వచ్చే పాట మాత్రమే గుర్తుండిపోయేలా ఉంది. వెంకట్ సి.దిలీప్ కెమెరా అమెరికా అందాల్ని బాగా చూపించింది. శ్రీనువైట్ల తన ఫార్ములాకి భిన్నంగా ప్రయత్నించారు. కానీ, కథ విషయంలో ఆయన చేసిన కసరత్తులు కనిపించినా.. కథనంలో బలం లేకపోవడం సినిమాకి మైనస్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తాయి.
బలాలు
+ నటీనటులు
+ కథా నేపథ్యం
+ అక్కడక్కడా హాస్యం
బలహీనతలు
- సగటు ప్రతీకార కథ, కథనం
- పతాక సన్నివేశాలు
చివరిగా: అమర్ అక్బర్ ఆంటొని.. కాస్త నవ్వులు పంచుతాడు!