మళ్లీ భారత్‌లోకి చెక్‌కు చెందిన ప్రముఖ మోటర్‌సైకిల్ బ్రాండు ‘జావా’ అడుగుపెట్టింది. మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ ‘జావా’ బ్రాండును తిరిగి తీసుకొచ్చింది. జావా ఫార్టీ టూ, జావా, జావా పెరాక్ పేరుతో మూడు కొత్త ‘జావా’ బ్రాండు మోటర్‌సైకిళ్లను గురువారం విడుదల చేసారు. ‘మా ద్విచక్రవాహనాల వ్యాపారానికి అత్యుత్తమ బ్రాండు జతయ్యింది. మహీంద్రా విలువలకు ‘జావా’ సరిగ్గా సరిపోయే బ్రాండు’ అని మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. ఈ మోటర్ సైకిళ్ల ఆవిష్కరణ కార్యక్రమంలో రుస్తోమ్‌జీ గ్రూపు ఛైర్మన్, ఎండీ బోమన్ రుస్తోమ్ ఇరానా, ఫై కేపిటల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థాపకుడు అనుపమ్ థరేజాలు కూడా పాల్గొన్నారు. ఆ బ్రాండుకున్న విశిష్ఠతను భారత్‌లో కొనసాగేలా చేయడమే తమ ఉద్దేశమని చెప్పారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలో పిథమ్‌పూర్ వద్ద ఉన్న మహీంద్రా ప్లాంటులో ఈ బైకులను తయారు చేస్తున్నారు. మహీంద్రాకు ఇందులో 60 శాతం వాటా ఉంది. 293 సీసీతో కూడిన ఈ మోటర్‌సైకిళ్ల బుకింగ్‌లు నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయి.