- 104 సేవలకు ముగింపుకు యోచన
- దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం తెచ్చిన పధకం
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నిరుపేద గ్రామీణులకు ఇంటి వద్దకే వచ్చి వైద్యసేవలందించే లక్ష్యంతో ప్రారంభమైన ఆరోగ్య పథకం నిలిచిపోనుందా..? గ్రామాలకే వచ్చి బీపీ, షుగర్ తదితర పరీక్షలు జరిపి మందులిస్తూ పేద వృద్ధులకు వరంలా మారిన 104 వాహనం మూలనపడనుందా..? ఈ సేవలను రద్దు చేసే దిశగా ప్రభుత్వం మొగ్గుచూపుతోందా అంటే అవుననే జవాబు వస్తోంది. ఈ సేవను రద్దు చేసి, అందులో పనిచేస్తున్న సిబ్బందిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై తెలంగాణ వైద్యారోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎంపీ కవితలు సూచన ప్రాయంగా ప్రస్తావిం చినట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. అరకొర జీతంతో అసౌక ర్యాల నడుమ విధులు నిర్వహిస్తున్న తమ కష్టాలు తీర్చాలంటూ ప్రభుత్వ పెద్దలతో మొరపెట్టుకుంటే.. ఏకంగా సర్వీసుకే మంగళం పాడే ఆలోచన చేయడం దారుణమని వాపోతున్నారు. గ్రామాల్లో వైద్య సౌకర్యాలు లేక చికిత్సకు దూరమవుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 104 సేవలను ప్రారంభించింది. నెల లో ఒక రోజు ఈ వాహనంలో వైద్యారోగ్య సిబ్బంది గ్రామానికి వెళ్లి సేవలందిస్తున్నారు. బీపీ, మధుమేహం తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలవారీగా మందులు అందజేసి వెళుతున్నారు. దీంతో ఆస్పత్రులకు వెళ్లకుండానే నిరుపేద రోగులకు వైద్య సేవలు అందుతున్నాయి.
అసౌకర్యాల మధ్యే సేవలు..
గ్రామీణ ప్రాంతాలలోని రోగులకు వరంలా మారిన 104 వాహనం.. సిబ్బంది పట్ల మాత్రం అసౌకర్యాల పుట్ట! నామమాత్రపు జీతాలు.. ఉద్యోగ భద్రత లేకపోవడం, అరకొర వసతులతోనే పదేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న సిబ్బంది తమ కష్టాలు తీర్చాలంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అయితే, ప్రభుత్వం మాత్రం 104 సర్వీసునే ఎత్తేసే ఆలోచన చేస్తున్నట్లు వారు మండిపడుతున్నారు. సర్వీసును ఎత్తేస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. రెగ్యులరైజ్ చేస్తారని కోటి ఆశలతో ఎదురుచూస్తుంటే పిడుగుపాటులా ఉన్న ఉద్యోగానికే ఎసరు వచ్చేలా ఉందని వాపోతున్నారు.
102 ఉండగా.. 104 ఎందుకు?
రాష్ట్రంలో 102 సర్వీసు విజయవంతంగా పనిచేస్తున్న నేపథ్యంలో 104 సేవల అవసరమేంటని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఈ సర్వీసును నిలిపేసి, అందులో పనిచేస్తున్న సిబ్బం దిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించాలని ప్రభు త్వం యోచిస్తోంది. దీంతో 104 సేవలను త్వరలో నిలపివేసేందుకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం.
ఎత్తివేసే యోచన విరమించుకోవాలి
‘గ్రామీణ పాంతాల్లో నిరుపేద రోగులకు మందులు అందజేస్తున్న 104 సర్వీసును ఎత్తివేయడం దారుణం. ఆ ఆలోచన విరమించుకోవాలి. 104 సేవలను మరింత విస్తృతం చేయాలి. నిధులు కేటాయించాలి. సేవలను ఎత్తివేసే యోచన మార్చుకోకుంటే పోరుబాట తప్పదు’ అని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజయ్య హెచ్చరించారు.
104 లో ఎవరెవరు?
ఈ వాహనాల్లో డ్రైవర్, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నిషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు విధులు నిర్వహిస్తుంటారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ 80 నుంచి 100 మంది వరకు సిబ్బంది ఉన్నారు.
సేవలను పటిష్టిం చేయాలి
‘104 వైద్యారోగ్య సేవలను పటిష్టం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన నిరుపేదలకు 104 సేవలు ఎంతో ఉపయోగపడుతు న్నాయి. వాటి సేవలు విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలి. అవసరమైన మందులు, నిధులు కేటాయించాలి. సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి’ అ ని సంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య సిబ్బంది డిమాండ్ చేశారు.