- ఎంబీబీఎస్ ఎక్కడ చదివినా నీట్ రాయాల్సిందే
- నిబంధనలను కఠినతరం చేయనున్న ప్రభుత్వం
వైద్య విద్యను అభ్యసించాలనే ఆసక్తి మాత్రమే కాదు.. తగిన సామర్థ్యం కూడా తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వైద్య కళాశాలల్లో సీట్ పొందాలంటే నీట్ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే.. అయితే, నీట్‌లో అర్హత సాధించకపోయినా విదేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని పలువురు విద్యార్థులు పక్క దేశాలకు వెళ్లి చదువు పూర్తి చేస్తున్నారు. ఇలా విదేశాల్లో చదివిన విద్యార్థులు భారతదేశంలో ప్రాక్టీస్ చేయాలంటే తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. ఇందుకు గానూ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఎంజీఈ) పరీక్షలో అర్హత సాధించాలి. దురదృష్టవశాత్తూ వీరిలో కేవలం 12 నుంచి 15 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షలో అర్హత సాధిస్తున్నారు. దీంతో వారికి ప్రాక్టీస్ చేసుకునే అర్హత లేకుండా పోతోంది. సంవత్సరాల పాటు విదేశాల్లో చదివిన చదువుకు ఫలితంలేకుండా పోతోంది.
ఎఫ్‌ఎంజీఈలో అర్హత సాధించకపోయినా, ప్రాక్టీస్ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోయినా సదరు విద్యార్థులు అక్రమంగా ప్రాక్టీస్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీనిని అడ్డుకోవాలంటే తగిన సామర్థ్యం ఉన్న విద్యార్థులే వైద్య విద్యను చదివేందుకు అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లి ఎంబీబీఎస్ పూర్తిచేయాలనుకున్నా సరే ముందుగా నీట్‌లో అర్హత సాధించాలనే నిబంధనను తప్పనిసరి చేసే యోచనలో ఉంది. ఈమేరకు ప్రభుత్వ వర్గాల్లో దీనిపై చర్చలు తుది దశలో ఉన్నాయని తెలుస్తోంది.