చిత్రం: టాక్సీవాలా
నటీనటులు: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు తదితరులు
కళ: శ్రీకాంత్ రామిశెట్టి
పాటలు: కృష్ణ కాంత్
సంగీతం: జేక్స్ బిజాయ్
కూర్పు: శ్రీజిత్ సారంగ్
ఛాయాగ్రహణం: సుజిత్ సారంగ్
కథనం, సంభాషణలు: సాయి కుమార్ రెడ్డి
నిర్మాత: ఎస్.కె.ఎన్
కథ, దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యాన్
సంస్థ: జీఏ2 పిక్చర్స్, యువి క్రియేషన్స్
విడుదల: 17-11-2018
విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’తో సంచలన విజయాన్ని సొంతం చేసుకొన్నారు. అప్పటిదాకా యువతరానికే చేరువైన ఆయన గోవింద్‌గా కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేశారు. ఆ తర్వాత వచ్చిన ‘నోటా’ మెప్పించలేకపోయింది. తిరిగి ఫామ్‌ని అందుకోవడమే లక్ష్యంగా ‘టాక్సీవాలా’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు విజయ్. ఈ చిత్రం విడుదలకి ముందే పలు అవాంతరాల్ని ఎదుర్కొంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకోకముందే లీక్ అయింది. అయినా చిత్రబృందం సినిమాపై నమ్మకంతో ప్రచార కార్యక్రమాల్ని చేపట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ చిత్రంతో విజయ్ తిరిగి ఫామ్ అందుకొన్నారా? ‘టాక్సీవాలా’ ఎలా ఉన్నాడు? తెలుసుకుందాం..
కథేంటంటే: శివ (విజయ్ దేవరకొండ) ఓ నిరుద్యోగి. నగరంలో ఉన్న తన బాబాయ్ (మధునందన్) దగ్గరికి చేరుకుని ఆయన సాయంతో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటాడు. కానీ ఏ ఉద్యోగం నచ్చదు. అందుకే క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. సొంతంగా ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుని దాన్నే జీవనోపాధిగా మార్చుకుంటాడు. ఆ కారు రాకతో శివ జీవితం మలుపు తిరుగుతుంది. అంతా సవ్యంగా సాగిపోతున్న దశలో ఆ కార్లో దెయ్యం ఉందనే విషయం తెలుస్తుంది. అంతలోనే ఆ దెయ్యం ఓ డాక్టర్ (ఉత్తేజ్)ని చంపేస్తుంది. దాంతో భయపడిపోయిన శివ తనకి కారు అమ్మిన యజమాని ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్లాక చావు బతుకుల్లో ఓ ప్రొఫెసర్ కనిపిస్తాడు. అతని ద్వారా కారులో ఉన్న దెయ్యం తాలూకు వివరాలు తెలుస్తాయి. అసలింతకీ ఆ దెయ్యం వెనక కథేమిటి? ఎందుకు డాక్టర్‌ని చంపేసింది? ఆ కారు ఎవరిది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: తెలుగు తెరకు పరిచయమున్న కథే ఇది. ఈమధ్య తక్కువయ్యాయి కానీ... ఇదివరకు ఇంట్లో దెయ్యం, బంగళాలో దెయ్యం అంటూ వాటి చుట్టూ నడిచే కథలు తరచుగా ప్రేక్షకుల ముందుకొచ్చేవి. ఇలాంటి కాన్సెప్ట్‌లు తెలుగులో మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దెయ్యం టాక్సీలో ఉండటం. దాని చుట్టూ కొత్తగా హాస్యం పండించే ప్రయత్నం చేశారు. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటూ ఆత్మని శరీరంతో వేరు చేయొచ్చనే విషయాన్ని జోడించి ఈ చిత్రానికి సైన్స్ ఫిక్షన్ టచ్ ఇచ్చిన విధానం కూడా బాగుంది. మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. దర్శకుడు కథని నడిపిన విధానం బాగుంది. హాస్యం కోసమని, హీరోయిజం కోసమని కథని విడిచి ఎక్కడా సాము చేయలేదు. తొలి సగభాగం కథంతా కూడా హాస్యంతో సాగుతుంది. అక్కడక్కడా సన్నివేశాలు కాస్త నిదానంగా సాగుతున్నట్టు అనిపించినా... క్రమం తప్పకుండా హాస్యం పండించడం మాత్రం మరిచిపోలేదు. దాంతో సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి. కారులో ఉన్న దెయ్యం ఎప్పుడైతే విజృంభించడం మొదలుపెడుతుందో అప్పట్నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. ద్వితీయార్ధంలో కారులో దెయ్యం ఎందుకుందనే విషయాలతో పాటు.. శిశిరగా మాళవిక నాయర్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. విజయ్ దేవరకొండ, మధునందన్‌తోపాటు, హాలీవుడ్ పాత్ర కలిసి చేసే సందడి నవ్విస్తుంది. ద్వితీయార్థంలో కారు యజమాని ఇంట్లోనూ, మార్చురీ గది నేపథ్యంలోనూ వాళ్లు చేసే హంగామా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. కథానాయకుడు, ఆయన కుటుంబం నేపథ్యంలో వచ్చే పతాక సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి.
ఎవరెలా చేశారంటే: విజయ్ దేవరకొండ మరోసారి తన పాత్రలో ఒదిగిపోయారు. తన పాత సినిమాల తాలూకు ఇమేజ్‌తో సంబంధం లేకుండా పాత్రలో ఎలా కనిపించాలో అలాగే చేశారు. కథానాయిక ప్రియాంక జవాల్కర్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ ఆమె తెరపై కనిపించిన విధానం మాత్రం బాగుంది. మాళవికా నాయర్ పాత్ర సినిమాకి కీలకం. సిజ్జు, ఉత్తేజ్ ప్రతినాయకులుగా కనిపిస్తారు. రవివర్మ, రవిప్రకాష్ , కల్యాణిలు కూడా కీలకపాత్రల్లో కనిపిస్తారు. యమున పాత్ర పరిమితమే అయినా బాగుంది. మధునందన్‌తోపాటు హాలీవుడ్ పాత్ర చేసిన యువ నటుడు వినోదాన్ని పండించే బాధ్యతని చక్కగా మోశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. జేక్స్ బిజోయ్ సంగీతం, సుజీత్ ఛాయాగ్రహణం సినిమాకి ప్రధానబలం. మాటే వినదుగా బాణీతోపాటు, తెరపై దాన్ని తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది. శ్రీజిత్ సన్నివేశాల కూర్పు బాగా కుదిరింది. యువీ క్రియేషన్స్, జీఏ2 సంస్థల స్థాయిలో నిర్మాణ విలువలున్నాయి. యువ దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ కాన్సెప్ట్‌ని అల్లుకున్న విధానం, దాన్ని తెరపైకి తీసుకురావడంలో స్పష్టత మెచ్చుకోదగిన రీతిలో ఉంది.
బలాలు
+ విజయ్ దేవరకొండ నటన
+ హాస్యం
+ కాన్సెప్ట్
బలహీనతలు
- ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు
చివరిగా: ‘టాక్సీవాలా’