ఈ నెల 20న జరిగే ధర్మపోరాట దీక్షను జయప్రదం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం నాడు నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సిటీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో అయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం చూసి మోదీ, అమిత్ షాలకు ఈర్ష్యాద్వేషాలు పెరిగిపోయాయి. ఏపీని అడుగడుగునా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ పై దాడికి ఆయన వీరాభిమాని శ్రీనివాస్ ఉపయోగించిన కత్తి కూడా ప్రభుత్వమే చేయించిందనే వైకాపా దిగజారుడు ప్రచారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కత్తి గుచ్చుకున్నా, కత్తి గాయమైనా రాష్ట్రపతి భవన్, రాజభవన్ లో ఫిర్యాదు చేయాలని, పోలీసుస్టేషన్లు ఎత్తివేస్తామని వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండి. అధికారంలోకి వచ్చినవాళ్లే అసెంబ్లీ, పార్లమెంట్ కి వెళ్లాలి...మిగిలిన వాళ్లు చట్టసభలకు పోకుండా వీధుల్లో తిరిగేలా చట్టం తెస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టుకోండి. వైకాపా నవ్వుల పాలవుతోందని అయన అన్నారు. దేశంలో అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది..జగన్ కి ప్రత్యేక చట్టాలేమీ లేవు. ఎక్కడ నేరం జరిగినా స్థానిక పోలీసుస్టేషన్లోనే ఫిర్యాదు చేస్తారు. రాష్ట్రపతి భవన్, రాజ్ భవన్ లోనే ఫిర్యాదు చేస్తామనే వైకాపా నేతల తీరు వింతగా ఉందని అన్నారు. ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండి. రాష్ట్రంలో ఓ వైపు తుపాన్, మరో వైపు కరువు ఉంటే పట్టించుకోరు. వైకాపాకు సుత్తి, కత్తి తప్ప ఏమీ కనిపించడం లేదు. ఓ వైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం మేం కేంద్రంతో పోరాడుతుంటూ వైకాపా నేతలు మాత్రం డ్రామాలేసుకుంటూ గడుపుతున్నారు. ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండని అన్నారు.