ఎవరికైతే దాచుకునే విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయో వాళ్లే సీబీఐకి భయపడతారని,అలాంటి వాళ్లే సీబీఐని తమ రాష్ట్రంలోకి రానివ్వమని అంటారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ్‌బంగ ప్రభుత్వాలు సీబీఐని తమ రాష్ట్రాల్లోకి అనుమతించబోమని చెప్పడంపై అరుణ్‌జైట్లీ స్పందించారు. అవినీతి విషయంలో ఏ రాష్ట్రానికీ సార్వభౌమాధికారం లేదు అని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఏపీలో సీబీఐ సోదాలు, దర్యాప్తు చేపట్టడానికి వీల్లేదంటూ సీఎం చంద్రబాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా అదే బాటలో నడిచారు. మధ్యప్రదేశ్‌లో భాజపా మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడుతుండగా విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చారు.అలాగే పెద్ద నోట్ల రద్దు విషయంపైనా మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు అత్యంత నైతికమైన చర్య అని, రాజకీయమైనది కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నోట్ల రద్దుపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జైట్లీ దీనిపై స్పందించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పన్ను రిటర్నుల ఫైలింగ్స్ పెరిగాయని, దాని వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు పెరిగాయని తెలిపారు. దీన్ని రాజకీయం చేయొద్దని అన్నారు.
పెద్ద నోట్ల రద్దు పెద్ద కుంభకోణం అని రాహుల్ గాంధీ శుక్రవారం మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నిన్న ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ ర్యాలీలో మాట్లాడిన మోదీ.. రాహుల్ గాంధీ విమర్శలను తిప్పి కొట్టారు. పెద్దనోట్ల రద్దుపై ప్రజలకు ఎలాంటి సమస్య లేదని, కేవలం కొందరికే సమస్య అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతల అనుచరులు, స్నేహితుల నుంచి డబ్బు తీసేసుకున్నామనే కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోందని మోదీ విమర్శలు చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన డబ్బుతో ప్రజా పనులను, సంక్షేమ పథకాలను చేపడుతున్నట్లు మోదీ వెల్లడించారు.