దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఒకటి. కేరళలోని పత్తనం తిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో శబరిమల క్షేత్రం నెలకొనివుంది. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే యాత్రికులు 18 పవిత్ర మెట్ల మీది నుంచి వెళ్లాల్సి ఉంటుంది. స్వామిని ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే దర్శించుకోవాల్సివుంటుంది. ముఖ్యంగా మలయాళ వృశ్చికమాసం అంటే నవంబరు-డిసెంబరుల్లో మండల చిరప్పు ప్రారంభమవుతుంది. ఇందు కోసం కార్తికం ముందునుంచి దీక్ష తీసుకుంటారు. దీక్ష స్వీకరించిన రోజు నుంచి భక్తుల జీవనశైలి మారిపోతుంది. నల్లని బట్టలు ధరించి, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకభుక్తం ఉంటూ. వారు సాగించే దీక్షలోని నియమాలు సామాన్యులకు కఠినమే. అలాగే దీక్షా సమయంలో అందరూ ‘స్వామి’గా భావించి వ్యవహరించడం అపురూప అనుభూతిని ఇస్తుంది. మండలకాలం అంటే 41 రోజుల పాటు స్వామిదీక్షను పూర్తిచేసుకొని ఇరుముడిని కట్టుకొని శబరిమలకు వెళ్లాలి. అయితే.. ఇలాంటివేవీ లేకుండానే నియమాలకు, ఆచారాలకు కొందరు భిన్నంగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా అన్ని వయసుల మహిళలకూ ఆలయప్రవేశంపై సాగుతున్న రచ్చపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మత విశ్వాసాలు, ఆచారాలను రాజ్యాంగం ప్రభావితం చేయలేదని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. సమానత్వం, హక్కుల పేరుతో.. ఆలయాల పవిత్రతను కలుషిత చేయడం తగదని మరికొందరు చెప్తున్నారు. ఆధునికతను ఒంటబట్టించుకున్న కొందరు మాత్రం.. ఆధ్యాత్మికవేత్తలు, భక్తుల వాదనలు, సూచనలు, అభ్యంతరాలను ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. అయ్యప్ప మాల వేసుకున్న పురుషులతో పాటూ.. మహిళలు, బాలికలూ ఆచారం ప్రకారమే నిష్టగా ఉంటారు. 41రోజుల దీక్ష పాటిస్తారు. చివరిగా స్వామివారిని దర్శించుకుని దీక్ష విడుస్తారు. అయితే.. ఇవేవీ లేకుండానే.. ఏదో టూరిస్ట్ స్పాట్ కు వచ్చినట్లుగా.. ఆలయంలోకి వస్తామనడం.. స్వామివారిని దర్శించుకుంటామనడం తగదని భక్తులు అంటున్నారు. ప్రధానంగా ఆధునిక అతివలు.. ఆచారాలను మంటగలిపే పనులు చేయొద్దని సూచిస్తున్నారు. శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశంపై వివాదాలు ఈనాటివి కావు. కాకుంటే.. ఈ రేంజ్ రచ్చ మాత్రం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు తీర్పులు.. ఆలయంలోకి వెళ్లేందుకు యువతుల ప్రయత్నాలు.. శబరిమలను ఉద్రిక్తతలకు కేంద్రంగా మార్చేశాయి. ఈ సమస్యలు త్వరితగతిన సమసిపోవాలని..శబరిమల ఇంతకుమునుపులా ఆధ్యాత్మికి కేంద్రంగా భాసిల్లాలని భక్తులు ఆశిస్తున్నారు.