రాజధాని అమరావతిలోని మంగళగిరి, తాడేపల్లి ప్రాంతంలో కబ్జాదారులు పెట్రేగిపోతున్నారు. 2014 సంవత్సరానికి పూర్వం తక్కువ ధరలకు నివేశన స్థలాలు కొనుగోలు చేసుకుని ఎటువంటి నిర్మాణాలు చేపట్టని స్థలాలపై రౌడీమూకలు కన్నేస్తున్నాయి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి వచ్చి ఎర్రబాలెం, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతంలోని కొందరు దళారుల ద్వారా ఖాళీ స్థలాల వివరాలు సేకరించి అమ్మేస్తున్నారు. ఎక్కువగా విజయవాడ నుంచి వస్తున్న ముఠానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో ఎన్.ఆర్.ఐ. జనరల్ ఆస్పత్రి ఎదుట ‘వై’ జంక్షన్ వద్ద ఏకంగా నలుగురికి చెందిన ఐదు ఎకరాల భూమి కబ్జా చేసేందుకు డాక్యుమెంట్లు సృష్టించి మోసానికి పాల్పడ్డారు. ఈ కేసు విషయంలో అతికష్టం మీద పోలీసులు చర్యలు చేపట్టి నిందితులను జైలుకు పంపారు. తాజాగా కబ్జాదారుల వల్ల ప్లాట్లు కోల్పోతున్నామని సొంతదారులు లబోదిబో అంటున్నారు. న్యాయం చేయాలని స్టేషన్‌కు వెళితే సివిల్ అంటూ రిజిస్టర్ చేయకుండానే పంపించి వేస్తున్నారని వాపోతున్నారు.
మంగళగిరి పట్టణం, తాడేపల్లి పరిసరాల్లో 2010 సంవత్సరానికి పూర్వం సెంటు భూమి రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల మించి లేదు. ఇప్పుడు రాజధాని కావటంతో స్థలాల విలువ నాలుగింతలు పెరిగింది సెంటు రూ.8లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వెళ్లింది. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం కొందరు విక్రయించుకుందామని చూస్తున్నారు. అయితే రెండేళ్లుగా ఈ ప్రాంతంలో బేరాలు రావటం లేదు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసినప్పటి నుంచి ఈ పరిస్థితి ఏర్పడిందని దళారులు చెబుతున్నారు. ఇళ్లు, స్థలాలు అమ్మాలంటే కొనేవారే లేరని విక్రయాలు చేయాలని చూసేవారు ఆవేదన చెందుతున్నారు. వీరంతా వృత్తులు, వివిధ పనులు, ఉద్యోగాల నేపథ్యంలో దూరంగా ఉంటున్నారు. తమ స్థలాలు భద్రంగానే ఉంటాయని ఆశతో ఉన్నారు. ఇటీవల కాలంలో విజయవాడకు ఒక ముఠా స్థానికులతో ఒప్పందాలు కుదుర్చుకుని యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు.
మంగళగిరి, పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోనే కబ్జాదారులు నకిలీ దస్తావేజులు సృష్టించి విక్రయించిన కేసులు 16 వరకు వెలుగులోకి వచ్చాయి. పరిష్కారమైన కేసులు ఐదు మాత్రమే ఉన్నాయి. తాజాగా విజయవాడ, ఎర్రబాలెం ప్రాంతంలోని ముఠాలు పెద్ద ఎత్తున అమాయకులకు చెందిన స్థలాలు కబ్జా చేసి విక్రయిస్తున్నాయి. గత రెండేళ్ల కాలంలో 32 స్థలాలు కబ్జాదారులు సొంతం చేసుకుని విక్రయించినట్లు తేలింది. వీటి విలువ సుమారు రూ.1.89 కోట్లఅని అంచనా. పోలీసులు కూడా కేసు నమోదులో వెనుకడుగు వేస్తున్నారు. ఫలితంగా దౌర్జన్యకారులు పెరిగిపోతున్నారు.