YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అక్రమ అంతస్తులు

అక్రమ అంతస్తులు
జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ నగరపాలక సంస్థలతో పాటు ఇతర పురపాలక సంఘాల్లోనూ పలు భవనాల నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. దీనిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్రమాలను అడ్డుకోవాల్సిన నగర, పట్టణ ప్రణాళికా విభాగాల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఫిర్యాదు అందిన సందర్భంలో తూతూమంత్రంగా చర్యలు చేపడుతున్న అధికారులు అనంతరం ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు. దాంతో సంబంధిత భవన నిర్మాణదారులు తమ ఇష్టానుసారంగా వీటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు.
నగర, పురపాలక సంఘాల్లో వాణిజ్య సముదాయాలతో పాటు గృహ సముదాయాల నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. జీ+2కు అనుమతి పొంది మూడు అంతస్తులు..జీ+3కి అనుమతి ఉంటే నాలుగు అంతస్తుల నిర్మాణాలు చేపడుతూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి సైతం గండి పడుతోంది. ఇలా అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలపై ఫిర్యాదులు అందితే సంబంధిత అధికారులు, సిబ్బంది తొలుత నిర్మాణదారులతో మాట్లాడి పనులను నిలిపివేయాలని సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను తొలగిస్తున్నట్లు ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో నమోదు చేసి అనంతరం ఈ విషయాన్ని పూర్తిగా వదిలేస్తున్నారు.
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో ఇలా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలు 100కు పైగా ఉంటాయని అంచనా. కాకినాడ నగరంతో పాటు ఇతర పురపాలక సంఘాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నగర, పట్టణాల్లో వాణిజ్య సముదాయాల నిర్మాణంలోనూ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. అనుమతులు లేకుండా అయిదారు అంతస్తులు నిర్మిస్తున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. జీ+5, జీ+6 భవనాల్లో సైతం రక్షణ చర్యలు అరకొరగానే ఉంటున్నాయి. ఆ భవనాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. భవన నిర్మాణాలకు అనుమతించే వారు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. జీ+3 దాటిన గృహాలు, వ్యాపార సముదాయాలకు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీ తప్పనిసరని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ తరహా భవనాల్లో అధిక శాతానికి ఈ అనుమతులు ఉండటం లేదు. జీ+3 వరకు నిర్మించుకునే భవనాలకు మాత్రమే అనుమతులు ఇవ్వడానికి నగరపాలక సంస్థ అధికారులకు అధికారం ఉంది. ఆ పరిధి దాటి నిర్మిస్తే ముందుగానే రాష్ట్ర స్థాయి నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంది. కానీ అనేక మంది అక్కడి వరకు వెళ్లకుండా జీ+3 అనుమతులతోనే  నాలుగు, అయిదు అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు.

Related Posts