విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎం.ఎస్.ధోని క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఎం.ఎస్.ధోనికి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి(ఏపీఈడీబీ) ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో విశాఖలోని ఓ హోటల్‌లో ఈ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఆర్కా స్పోర్ట్స్ సంస్థ రూ.60 కోట్లతో రెండు దశల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ అకాడమీని, అంతర్జాతీయ పాఠశాలను అభివృద్ధి చేస్తుంది.క్రికెట్‌తోపాటు ఇతర క్రీడలకూ ఉపయోగకరంగా ఉండేలా దాదాపు 24 క్రీడా మైదానాలు(ఇండోర్ అండ్ అవుట్ డోర్)ను నిర్మించనున్నట్టు తెలిసింది. ధోనీ అకాడమీతో విశాఖ క్రీడా ముఖచిత్రంతో పాటు రాష్ట్ర క్రీడాముఖచిత్రంలో కూడా పెనుమార్పులు సంభవిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అకాడమీని విశాఖలో ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయాలను త్వరలోనే నిర్వహకులు ప్రకటించనున్నారు. మరో పక్క కొన్ని రోజుల క్రితం, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా చంద్రబాబుని కలిసి, అమరావతిలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశం పై చర్చించిన విషయం తెల్సిందే.ఇది ఇలా ఉంటే, విశాఖలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఇంటెలిజంట్ గ్లోబల్ హబ్(ఐ-హబ్)ను ఏర్పాటుచేస్తామని, వచ్చే మంత్రిమండలి సమావేశంలోనే భూకేటాయింపు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు.