ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రకు చెందిన విశాఖ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు రాబోయే ఎన్నికల్లో తిరిగి భీమునిపట్నం నుంచి పోటీ చేస్తానని ముందుగానే ప్రకటించేశారు. అయిదేళ్లుగా అభివృధ్ధి పనులు సాగించిన నేపధ్యంలో భీమిలోనే నిలబడి ఓటు అభ్యర్థిస్తానని మంత్రి అంటున్నారని భోగట్టా. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి భీమిలిలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, అటువంటి అభివృద్ది పనులే తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారని సమాచారం. గత 2014 ఎన్నికల్లోకన్నా ఈసారి మరింత మెజారిటీ తనకు లభిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వెలిబుచ్చుతున్నారని తెలుస్తోంది. భీమిలి నియోజకవర్గం మంత్రి గంటా పరిధిలో ఉంది. కాగా వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గంటాను ఓడించాలని భావిస్తున్నా ఆయనకు సరైన అభ్యర్ధి దొరకలేదని భోగట్టా. వైఎస్ఆర్ సీపీలో ప్రస్తుతం భీమిలి ఇంచార్జ్ గా ఉన్న విజయనిర్మల ఎమ్మెల్యే అభ్యర్థి కాబోరని ఆ పార్టీ వారే అంటున్నారట. ఆమెను పార్టీలో ముందువుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పార్టీ బలం పుంజుకోలేదని అంటున్నారు. మరోవైపు మూడు మండలాల పరిధిలో ఉన్న భీమిలి నియోజకవర్గంలో మండలానికి ఒక్కరైనా బలమైన నేత వైసీపీకి లేరనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఫలితంగా భీమిలి నియోజకవర్గంలో వైసీపీ పూర్తిగా డీలా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు క్యాబినెట్ లో పేరుసంపాదించిన గంటాకు భీమిలిలో తగిన ప్రత్యర్ధి లేకపోవడంతో ఆయన మరింత ధీమాలో ఉన్నారని సమాచారం. దీంతో ఇక్కడ గెలవడం ముఖ్యంకాదని, మెజారిటీ మరింతగా రావాలని గంటా తన క్యాడర్ కి కొత్త టార్గెట్లు పెడుతున్నారని సమాచారం. దీనికితోడు గంటా గడచిన ఆరు నెలలుగా భీమిలిలో విరివిగా పర్యటిస్తున్నారు. పనిలోపనిగా తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ జనానికి మరింత చేరువ అవుతున్నారని సమాచారం. మరోవైపు గంటాను విమర్శించేందుకు ప్రతిపక్షాలు ఇన్నాళ్ళూ భూ కబ్జాలను ఆయుధంగా చేసుకునేవి. అయితే ఇటీవల సిట్ నివేదికలో గంటాకు క్లీన్ చిట్ వచ్చింది. దాంతో గంటా సేఫ్ జోన్ లోకి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా తన జీవితం ఒక తెరిచిన పుస్తకమని, దమ్ముంటే అవినీతి, అక్రమాలను బయట పెట్టాలని ప్రతిపక్షాలకు గంటా సవాల్ విసురుతున్నారు. ఈ విధమైన గంటా తీరును గమనించిన స్థానికులు ఆయన మరోమారు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబాబు కూడా గంటాపై అపారమైన నమ్మకంతో విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఎలాగూ భీమిలి సీటుపై దీమా వ్యక్తం చేస్తున్న గంటా అటు ఉత్తరాంధ్రలో కూడా మెజారిటీ సీట్లు తెచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం