సిబిఐ కి ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశం లేకుండా ఒక జిఓ తెచ్చి దేశవ్యాప్త చర్చకు తెరతీశారు చంద్రబాబు. ఇది పెద్ద రచ్చకు దారితీస్తుందన్నది ఆయనకు తెలియంది కాదు. కానీ దీని వెనుక పెద్ద వ్యూహాన్నే చంద్రబాబు సిద్ధం చేశారన్న టాక్ వినవస్తుంది. సిబిఐ అధికారులు కోర్టులకు ఎక్కి పరువు తీసుకుంటున్న దశలో తన నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత పెద్దగా ఏమి ఉండదన్న లెక్క పసుపు అధినేత వేశారంటున్నారు. వ్యవస్థలను మోడీ దెబ్బతీస్తున్నారని చాటిచెప్పడంతో బాటు ఎన్నికల ముందు బిజెపి తనపై సిబిఐ ని ఉసిగొల్పకుండా ముఖ్యంగా పోలవరం వంటి జాతీయ ప్రాజెక్ట్ కి నిధులు కేంద్రం ఇస్తున్న నేపథ్యంలో నేరుగా సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగి తమవారిని ఇబ్బంది పెట్టకుండా ముందే జాగ్రత్త పడ్డారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.తన నిర్ణయాన్ని సమర్ధవంతంగా జన ఆమోదానికి మోడీ వ్యతిరేక పార్టీలతో సిబిఐ పై ఇదే తరహా యుద్ధం చేయించాలని బాబు స్కెచ్ గీశారని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాకా బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అదే రూట్ లో వెళ్లేందుకు ముందుకు రావడం ఇందులో భాగమంటున్నారు. తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ఇదే తరహా నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వడం వెనుక మోడీ సర్కార్ పై విపక్షాల పోరాట అస్త్రాల్లో ఈ బ్రహ్మాస్త్రం చంద్రబాబే బయటపెట్టినట్లు యుపిఎ అనుబంధ పార్టీల నుంచి వస్తున్న వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ అంశంపై విస్తృత స్థాయి చర్చ జరిగి మోడీ పరువు తీయాలన్న బాబు స్కెచ్ ఇప్పటివరకు చక్కగానే సాగుతుంది. మరి దీన్ని తిప్పికొట్టేందుకు కమలదళం ఎత్తుగడ ఏమిటన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.