వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఎవరినో ఒకరిని కెలుకుతూనే ఉంటారు. ప్రస్తుతం ఆయనకు సినిమాల ద్వారా వచ్చే ప్రచారం కన్నా ఇలా వాళ్లను వీళ్లను కెలకడం ద్వారా వచ్చే ప్రచారమే ఎక్కువైంది. తన సినిమా ప్రచారం కోసం కూడా పక్కోళ్లను వాడుకోవడానికి వర్మ అస్సలు మొహమాటం పడరు. ప్రస్తుతం అదే చేస్తున్నారు. దేశంలోనే స్టార్ దర్శకుల్లో ఒకరైన శంకర్‌ను వర్మ వాడేస్తున్నారు. రాంగోపాల్ వర్మ సమర్పణలో ధనంజయ, ఇరా మోర్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘భైరవగీత’. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మితమైంది. ఈ చిత్రానికి కథ, కథనాన్ని వర్మ అందించారు. వర్మ శిష్యుడు సిద్ధార్థ తాతోలు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈనెల 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే, రజినీకాంత్ హీరోగా, అక్షయ్‌కుమార్, ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో శంకర్ నిర్మించిన భారీ చిత్రం ‘2.0’కు ‘భైరవగీత’ పోటీ అని వర్మ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. అది కూడా చాలా వైవిధ్యంగా చేస్తున్నారు. ‘రోబో 2.0కు పోటీగా భైరవగీత విడుదల చేస్తున్నాడని కొత్త దర్శకుడు సిద్ధార్థను మెగా డైరెక్టర్ శంకర్ ఎగతాళి చేస్తున్నట్లున్నారు’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. శంకర్, సిద్ధార్థ ఫొటోలను పక్కపక్కన పెట్టడమే కాకుండా శంకర్ దండం పెడుతున్న ఫొటోను జతచేశారు. ఇక్కడితో ఆగకుండా మరో ట్వీట్ కూడా చేశారు. ‘రోబో 2.0కు పోటీగా భైరవగీత విడుదల చేస్తున్నాడని చిన్న దర్శకుడు సిద్ధార్థను చూసి పెద్ద దర్శకుడు శంకర్ నవ్వుతున్నారు’ అంటూ పేర్కొన్నారు. ఈ ట్వీట్లు చూస్తుంటే ‘2.0’ ఇమేజ్‌ను తన సినిమాకు వాడేసుకోవాలని వర్మ చూస్తున్నట్లు అనిపిస్తోంది.