మోదీ ప్రధాని అయ్యాక దేశంలో రాజకీయ కాలుష్యం పెరిగిపోయిందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఇది ఢిల్లీ రాష్ట్రాన్ని పీడిస్తున్న కాలుష్యం కంటే ప్రమాదకరంగా మారిందన్నారు. సోమవారం అయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.. మోడీ కాలుష్యాన్ని కడిగేందుకు బిజెపియేతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయని ఆయన చెప్పారు. కేవలం ఓట్లు దండుకోవడానికే తాను చాయ్వాలానని మోడీ చెప్పుకున్నారని యనమల అన్నారు. రాఫెల్పై కాగ్ నివేదికను పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టలేదో అరుణ్ జైట్లీ చెప్పాలని కోరారు. సుప్రీంకోర్టు వద్ద రహస్యాలు ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. సిబిఐ అధికారులు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడంతో సంస్థ అప్రదిష్టపాలైందని అయన అన్నారు. ఆర్జేడీ అధినేత లాలూను అన్యాయంగా ఐఆర్సిటిసి కుంభకోణంలో ఇరికించారని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సిబిఐ ప్రత్యేక డైరెక్టర్గా నియమితుడైన ఆస్థానా కుమ్మక్కై లాలూను ఇరికించారని ఆయన అన్నారు. సివిసికి ఆలోక్ వర్మ వాంగ్మూలం కంటే ఆధారాలు ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాలకు సార్వభౌమాధికారం లేదని జైట్లీ అనడం సబబు కాదని అన్నారు. రాజ్యాంగంలో కేంద్ర విధులు, రాష్ట్ర విధులపై స్పష్టత ఉందని, అన్నీ తెలిసి కూడా తెలియనట్లు అరుణ్ జైట్లీ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. జైట్లీ వ్యాఖ్యలు సమాఖ్య స్ఫూర్తికే తూట్లు పొడిచేలా ఉందని విమర్శించారు.