రాష్ట్రంలో లోటు వర్షపాతం రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నీరు-ప్రగతి, వ్యవసాయంపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగు చేసిన ప్రతి ఎకరాలో పంటను కాపాడాలని, ఇందుకోసం రైతన్నలకు వ్యవసాయం, ఎరువుల వాడకం, తెగుళ్ల నివారణ పై వర్క్ షాపులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. సూక్ష్మసేద్యం, నదుల అనుసంధానంతో నీటి కొరతను అధిగమించవచ్చని చెప్పారు ఇప్పటి వరకు 35% లోటు వర్షపాతం ఉందని అన్నారు. రబీలో సాధారణంకన్నా 30వేల హెక్టార్లలో సాగు పెరిగిందన్నారు. ముందస్తు వరిసాగు శుభ సంకేతమని అయన అన్నారు.
వ్యవసాయం నుంచి ఉద్యాన సాగువైపు మళ్లామన్నారు. జాతీయస్థాయిలో 3% వృద్ధి ఉంటే ఏపీలో 11% వృద్ధి సాధించామని తెలిపారు. ప్రతి ఏడాది 10 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం పెంచాలని అధికారులకు సూచించారు.రాబోయే 4నెలల్లో మరో రూ.4వేల కోట్ల నరేగా నిధులు వినియోగించాలని ఆదేశించారు. రూ.10వేల కోట్ల నరేగా నిధుల వినియోగమే లక్ష్యమన్నారు. కరవు మండలాల్లో 150 రోజుల పనిదినాలను పూర్తిచేయాలని చెప్పారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్ల పనులు ముమ్మరం చేయాలని, పక్కాఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలరని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అంటువ్యాధుల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.