నెల్లూరులో ధర్మపోరాటం సభ దిగ్విజయంగా జరగబోతోంది. కేంద్ర ప్రభుత్వ తీరు, ఏపీకి మోదీ చేస్తున్న అన్యాయంపై ప్రజల్లో రోజురోజుకు కసి పెరిగిపోతోంది. నెల్లూరు లాంటి చిన్న జిల్లాలో ధర్మపోరాటం సభకు లక్ష పాతిక వేల మందికి పైగా ప్రజలు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి అన్నారు. సోమవారం అయన మంత్రి నారాయణతో కలిసి నెల్లూరు శ్రీ వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ధర్మపోరాటం సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపారు. మంత్రి మాట్లాడుతూ దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటిని ఒకే వేదిక మీదకు తేవడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని నాలుగేళ్లుగా అడిగడిగి విసిగిపోయాం. ఓ వైపు ఏపీ హక్కుల కోసం టీడీపీ పోరాడుతుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం మోదీతో లాలూచీ పడ్డాయని ఆరోపించారు. సీబీఐని అనుమతించేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం, హక్కు. ఏం కేసులుంటే మేం భయపడాలి. సీబీఐను కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో పెట్టుకుంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆర్బీఐ గవర్నర్ మాట్లాడే పరిస్థితి వచ్చిందని అన్నారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసే పరిస్థితి తెచ్చారు. సీబీఐలో అంతర్యుద్ధం తలెత్తిన పరిస్థితి వచ్చాక. .మీకు విశ్వసనీయత ఎక్కడుంది. ఇలాంటి సమయంలో మేం సీబీఐకి కన్సెంట్ ఉపసంహరించుకున్నాం. దేశంలో 29 రాష్ట్రాలుంటే సీబీఐకి కన్సెంట్ ఇచ్చింది తొమ్మిది రాష్ట్రాలే. మిగిలిన రాష్ట్రాలు కూడా ఏపీ బాటలో పయనిస్తున్నాయని అన్నారు. ఈ రోజుకీ సీబీఐకి గుజరాత్ ప్రభుత్వం కన్సెంట్ ఇవ్వలేదు..మీరా మా గురించి మాట్లాడేది. వ్యవస్థలను నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందని అన్నారు. ఏపీ హక్కులు సాధించుకునేంత వరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేసారు.