ఆలయ పరిసరాల్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఆలయ ప్రాంగణంలో పోలీసుల ఆంక్షలను వ్యతిరేకిస్తూ ఆదివారం అర్ధరాత్రి భక్తులు ఆందోళన చేపట్టగా, పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో, ఈ విషయం తెలుసుకున్న బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు తిరువనంతపురంలోని సీఎం నివాసంతో పాటు కోచి, కోజికోడ్, అలప్పూజ, కొల్లం, ఇడుక్కి, కాలడి సహా కేరళవ్యాప్తంగా నిరసనలకు దిగారు. అన్ని వయస్సుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలని సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీం తీర్పు అనంతరం అక్టోబరులో నెలవారీ పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరవగా, నిషేధిత వయసు మహిళలు శబరిమల వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని భక్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. తాజాగా, మండల, మకరువిలక్కు పూజలకు మరోసారి శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకోగా, గత ఘటనలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 15 వేల మంది పోలీసులను మోహరించి, సన్నిధానంలో 144 సెక్షన్ విధించారు. రాత్రి వేళ ఆలయ పరిసరాల్లో భక్తులెవరూ ఉండరాదని నిషేధాఙ్ఞలు విధించారు. అయితే ఈ ఆంక్షలపై అసంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు ఆదివారం అర్ధరాత్రి ఆలయ ప్రాంగణం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు, హిందూ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగాయి. ఆలయంలో ఆంక్షలు ఎత్తివేయాలని, శబరిమలలో మోహరించిన పోలీసు బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, పోలీసుల చర్యపై కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్ మండిపడ్డారు. శబరిమలలో ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉన్నాయని ఆయన దుయ్యబట్టారు. అవసరం లేకున్నా 144 సెక్షన్ విధించి అయ్యప్ప భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. భక్తులేమైనా ఉగ్రవాదులా.. 15వేల మంది పోలీసులను ఎందుకు నియమించారు అని ప్రశ్నించారు. రాత్రికి సన్నిధానంలో ఉండొద్దని ఆదేశిస్తే, స్వామికి తీసుకొచ్చిన నెయ్యిని అభిషేకానికి ఎవరిస్తారని ధీరేశ్ అనే భక్తుడు ప్రశ్నించారు. మరోవైపు తీర్పును అమలు చేయడానికి కొంత సమయం కావాలని కోరుతూ ట్రావెన్‌కోర్ దేవస్వాం బోర్డు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. వేలాది మంది భక్తుల భద్రత పూర్తి బాధ్యత తమదేనని, శతాబ్దాలుగా కొనసాగుతోన్న ఆలయ సంప్రదాయానికి తాము విఘాతం కలిగించబోమని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.