YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

రాజకీయాలకు దూరంగా రాయపాటి

రాజకీయాలకు దూరంగా రాయపాటి
రాయపాటి సాంబశివరావు.. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న నేత. ఎక్కువ కాలం కాంగ్రెస్ తో అనుబంధాన్ని కొనసాగించిన రాయపాటి సాంబశివరావు కుటుంబం ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా అటువైపు చూడలేదు. అయితే రాష్ట్ర విభజన చేయడంతో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై కొట్టేసి గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. టీడీపీ గుర్తు మీద ఆయన ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే గత కొద్దిరోజులుగా ఆయన రాజకీయ సన్యాసం చేస్తారన్న మాట విన్పిస్తోంది. తాను రాజకీయంగా పక్కకు తప్పుకుని తన కుమారుడికి రాజకీయ వారసత్వాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారని ఆయన తన సన్నిహితుల ముందు అనేక పర్యాయాలు చెప్పారు.దీంతో ఆయన రాజకీయ సన్యాసం గ్యారంటీ అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఆయన మరోసారి తన మనసులో మాట చెప్పేశారు. తాను వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పేశారు. నిజానికి రాయపాటి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పడంతోనే ఆయన కుమారుడు రంగారావుకు పార్టీలో సముచిత స్థానం కల్పించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. రంగారావును అసెంబ్లీ బరిలోకి దింపాలని భావించారు. రంగారావుకు లోకేష్ అండదండలు కూడా ఉండటంతో గుంటూరు నగరంలో ఒక సీటు ఇస్తారని అందరూ భావించారు.కాని రాయపాటి తిరిగి తానే నరసరావుపేట లోక్ సభ పరిధిలో ఉంటానని ప్రకటించడంతో ఇక రంగారావుకు ఈసారి ఛాన్స్ లేనట్లేనని చెబుతున్నారు. రాయపాటి మనసు మార్చుకోవడానికి కూడా బలమైన కారణమే ఉందంటున్నారు. తన చిరకాల ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. కన్నా లక్ష్మీనారాయణ, రాయపాటి సాంబశివరావులిద్దరూ ఒకే పార్టీలో ఉన్నా ఒకరంటే ఒకరికి పడేది కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనేకసార్లు పంచాయతీ చేయాల్సి వచ్చింది. అయితే ఈసారి ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో కన్నా జిల్లా రాజకీయాలపై తన ముద్ర చూపుతారని భావించి రాయపాటి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు చెబుతున్నారు. నిజానికి రాయపాటి ఎన్నాళ్ల నుంచో టీటీడీ ఛైర్మన్ కావాలని కలలు గంటున్నారు. ఈసారైనా నెరవేరుతుందేమోనని భావిస్తే చంద్రబాబు సయితం రాయపాటి మొర ఆలకించలేదు. పైకి తనలాంటి వాళ్లు పోటీ చేస్తే దేవెగౌడలాగా చంద్రబాబు ప్రధానమంత్రి అవుతారనిచెబుతున్నా, కన్నా ను రాజకీయంగా జిల్లాలో నిరోధించేందుకే రాయపాటి ఈ నిర్ణయం తీసుకున్నారన్నది పొలిటికల్ వర్గాల్లో విన్పిస్తున్నటాక్. మరి రాయపాటి వారసుడికి అసెంబ్లీ టిక్కెట్ ను చంద్రబాబు ఇస్తారో? లేదో? చూడాలి.

Related Posts