ప్రధాని మోదీతో చంద్రబాబు గంటసేపు భేటీ
17 పేజీలతో కూడిన వినతిపత్రం అందజేత
పెండింగ్‌లో ఉన్న విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి నెరవేర్చాల్సిన హామీలతో కూడిన 17 పేజీల వినతిపత్రాన్ని ప్రధానికి అందజేశారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.58వేల కోట్లతో సమర్పించిన పూర్తి స్థాయి అంచనాల్ని ఆమోదించడం, రాజధాని అమరావతి నిర్మాణం కోసం వచ్చే కేంద్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించడం, రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను 175 నుంచి 225కి పెంచడంతోపాటు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా ప్రధానిని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా కేంద్రం నుంచి సుమారు రూ.3వేల కోట్లు రావాల్సి ఉంది. ఆ మొత్తం వెంటనే ఇప్పించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.58వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టు అథారిటికీ సవరించిన అంచనాలు సమర్పించిన నేపథ్యంలో, వాటిని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి, విధి విధానాలు ఖరారు చేసి, నోటిఫికేషన్ జారీ చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని విన్నవించారు.
.ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఈఏపీ రుణాల గురించి సీఎం ప్రత్యేకంగా చర్చించారు. వీటి కింద రూ.20,010 కోట్లు రావాల్సి ఉండగా, ఐదేళ్లలో ఇంత మొత్తాన్ని ఈఏపీ ప్రాజెక్టులపై ఖర్చు పెట్టే సామర్థ్యం తమకు లేదని వివరించారు. ఆ మొత్తంతో పాత విదేశీ రుణాలు, చిన్న పొదుపు మొత్తాలు, నాబార్డు రుణాలు చెల్లించేందుకు, దేశీయ బ్యాంకులు, నాబార్డు, హడ్కో వంటి సంస్థల నుంచి రుణాలు తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. అరుణ్ జైట్లీకి రాసిన లేఖలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. విశాఖలో రైల్వే జోన్, అమరావతి మెట్రో రైల్, తదితర అంశాలపైనా మోదీతో చంద్రబాబు చర్చించారు.