సముద్ర నాచు.. కాసుల వర్షం కురిపిస్తుంది. ఒకప్పుడు వ్యర్ధమనుకునే ఈ పదార్ధానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడడమే కారణం. సముద్రపు నాచుకు గిరాకీ రావడమేంటని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఇది పోషకాల గని. అంతేకాక మంచి సౌందర్య సాధనం. అందుకనే పలు కంపెనీలు సీ వీడ్ ను సేకరించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నాచును అందించే వారినీ విపరీతంగా ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం మండపం సముద్ర ప్రారతంలో సీవీడ్ సముద్రపు నాచు మొక్కలు పెంపకాన్ని చేపట్టారు. వీరు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఈ నాచుమొక్కల పెరుగుదల వేసవిలో అధికంగా ఉంటుంది. వేట విరామ సమయంలో మత్స్యకారులు ఈ నాచుమొక్క పెంపకం ద్వారా ఉపాధి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 45 రోజులుకే ఈ నాచుమొక్క సముద్రంలో పెరుగుతుంది కాబట్టి పెద్దగా నిరీక్షించాల్సిన అవసరం లేదని త్వరితగతిన కష్టానికి తగ్గ ఫలం అందుకోవచ్చని చెప్తున్నారు. ఈ నాచు సాగుపై ఇక్కడి మత్స్యకారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మత్స్యకారుల జీవనోపాధికి, ఆర్ధిక మెరుగుదలకు సీవీడ్ పెంపకాన్ని ప్రోత్సహించాలని అంటున్నారు. సముద్ర సంపదపై ఆధారపడే మత్స్యకారులకు ఇదొక వరంగా ఉంటుందని, ముందు ముందు ప్రధాన జీవనాధారంగా మారుతుందని చెప్తున్నారు.
సముద్రపు నాచును ప్రాసెసింగ్ చేస్తారు. అనంతరం వాటి ద్వారా వచ్చే పదార్దాలతో వివిధ ఔషదాలు, సౌందర్య సాధనాలు తయారుచేస్తారు. అంతేకాక వ్యవసాయంలో వరి, మినుము పెరుగుదలకు తోడ్పడే విధంగా దీనిని ఎరువుగా వాడతారు. సీ వీడ్‌ను ద్రవ రూపంలో, గులికల రూపంలో జీవన ఎరువులుగానూ తయారుచేసుకోవచ్చు. ఇప్పటికే చైనా, ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పైన్స్, సౌత్ కొరియా దేశాలు ఈ నాచు పెంపకాన్ని అభివృద్ధి చేశాయి. విరివిగా నాచు ద్వారా ఉత్పత్తి అయిన పదార్ధాలను వినియోగిస్తున్నాయి. సీవీడ్‌ను సేంద్రీయ ఎరువుల తయారీతో పాటు ఆహారపదార్ధాలు, టెక్స్‌టైల్స్, రసాయన పరిశ్రమలలోనూ వాడుతున్నారు. సముద్రపు నాచును అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో అఖిల భారత సమన్వయ ఉప్పునీటి పరిశోధన కేంద్రం మంచి ఫలితాలు సాధించింది. బాపట్లలోని ఈ కేంద్రం తాజాగా నాచు పెంపకంతో సముద్ర సంపదపై దృష్టి సారించింది. బాపట్లలోని అఖిల భారత సమన్వయ ఉప్పునీటి పరిశోధన కేంద్రం ఉప్పు, చౌడు భూములను సశ్యశ్యామలం చేసేందుకు అనేక పథకాలను రూపొందిస్తోంది. ఇదిలాఉంటే సముద్రంలో నాచు పెంపకం ద్వారా సముద్ర జలాలనూ కొంత మేర శుద్ధి చేయవచ్చు. తద్వారా సముద్ర, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ఇంతటి ఉపయోగాలున్న సీవీడ్ పెంపకాన్ని విస్తృత స్థాయిలో ప్రోత్సహించి మత్స్యకారులకు అండగా నిలవాలని అంతా కోరుతున్నారు.