YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

కార్తీకపురాణం - 13 వ అధ్యాయం..!!

కార్తీకపురాణం - 13 వ అధ్యాయం..!!

కన్యాదాన ఫలం, సువీరచరిత్రము

తిరిగి వశిష్టుడు జనకుడితో ఇలా అంటున్నాడు ”ఓ మహారాజా! కార్తీకమాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటిని వివరిస్తాను విను… కార్తీకమాసంలో నదీస్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం. ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చు అంతా భరించే శక్తిలేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాలు, సంభావనలతో తృప్తిపరిచినా ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఓ పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్లయితే… ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి. ఎన్ని బావులు, చెరువులు తవ్వించినా… పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే… తను తరించడమే కాకుండా… తన పితృదేవతలను కూడా తరింపజేసినవారవుతారు. ఇందుకు ఒక వృత్తాంతముంది. చెబుతాను విను…” అని ఇలా చెప్పసాగాడు…

_*సువీర చరితం*_

పూర్వం వంగ దేశంలో గొప్ప పరాక్రమ వంతుడు, శూరుడు అయిన ”సువిరు”డను ఒక రాజు ఉండేవాడు. అతనికి రుపవతి అయిన భార్య ఉంది. ఒకసారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు. దీంతో అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి, ధన హీనుడై, నర్మదానదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని, కందమూలాలు భక్షిస్తూగడపసాగాడు. కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికను కన్నది. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుచుండేవారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా… శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రోజురోజూ అభివృద్ధి కాసాగింది. అతిగారాబంతో పెరగసాగింది. అలా రోజులుగడుస్తుండగా… ఆ బాలిక యవ్వనవతియైంది. ఒక దినాన వానప్రస్తుడి కుమారుడు ఆ బాలికను చూసి, అందచందాలకు పరవశుడై, తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు. అందుకా రాజు ”ఓ మునిపుత్రా…! ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను. మా కష్టాలు తీరేందుకు కొంత ధనమిచ్చినట్లయితే… నా బిడ్డనిచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. దాంతో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా లేకున్నా… బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. కుబేరుడిని మెప్పించి, ధన పాత్ర సంపాదించాడు. రాజు ఆ పాత్రను తీసుకుని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. నూతన దంతపతులిద్దరినీ అత్తవారింటికి పంపాడు.
అలా మునికుమారుడు తన భార్యను వెంటబెట్టుకుని, తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, నమస్కరించి, జరిగిన సంగతిని చెప్పాడు. తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు. అయితే సువీరుడు మునికుమారుడిచ్చిన పాత్రను తీసుకుని, స్వేచ్ఛగా ఖర్చుచేస్తూ… భార్యతో సుఖంగా ఉండసాగాడు. కొంతకాలానికి అతనికి మరో బాలిక జన్మించింది. ఆమెకు కూడా యుక్తవయసు రాగానే, ఎవరికైనా ధనానికి అమ్మాలనే ఆశతో ఎదురుచూడసాగాడు.
ఒక సాధువు తపతీ నదీ తీరం నుంచి నర్మదా నదీ తీరానికి స్నానార్థం వస్తుండగా… దారిలో ఉన్న సువీరుడిని కలుసుకున్నాడు… ”ఓయీ! నీవెవరు? నీ ముఖ వర్చస్సు చూస్తే రాజవంశంలో పుట్టినవాడిలా ఉన్నావు. ఈ అడవిలో ఏం చేస్తున్నావు? భార్యాపిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణమేమిటి?”అని ప్రశ్నించాడు. దానికి సువీరుడిలా చెబుతున్నాడు… ”ఓ మహానుభావా! నేను వంగదేశాన్ని పరిపాలించేవాడిని. నా పేరు సువీరుడు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్యాసమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమేది ఉండదు. పుత్రశోకం కంటే దు:ఖం ఉండదు. అలాగే భార్యావియోగం కంటే సంతాపం వేరొకటి లేదు. అందువల్ల రాజ్యభ్రష్టుడనైనా… ఈ కారడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బతుకుతున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకు ఇచ్చి, వాడి వద్ద కొంత దానం తీసుకున్నాను. దాంతో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను” అని చెప్పగా… ”ఓ రాజా! నీవు ఎంతటి దరిద్రుడవైనా… ధర్మ సూక్షం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్య విక్రయం మహాపాతకం. కన్యను విక్రయించువాడు అసి పత్రవానమనే నరకాన్ని అనుభవిస్తాడు. ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం ఫలించదు. కన్య విక్రయం చేసేవారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపిస్తారు. అలాగే కన్యను ధనమిచ్చి కొని, పెండ్లాడిన వారి గృహస్థధర్మాలు వ్యర్థమగుటయేకాకుండా, అతను మహా నరకం అనుభవిస్తాడు. కన్యను విక్రయించేవారికి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రాబోయే కార్తీక మాసంలో రెండో కుమార్తెకు శక్తికొలదీ బంగారు ఆభరణాలతో అలంకరించి, సదాచార సంపన్నుడికి, ధర్మబుద్ధిగలవాడికి కన్యాదానం చేయి. అట్లు చేసినట్లయితే గంగాస్నానం, అశ్వమేథయాగ ఫలాలను పొందుతావు. మొదటి కన్యను అమ్మిన పాప ఫలాన్ని తొలగించుకున్న వాడివవుతావు” అని రాజుకు హితోపదేశం చేశాడు.
అందుకారాజు చిరునవ్వుతో… ”ఓ మునివర్యా! దేహసుఖం కంటే దానధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువా? తాను బతికుండగానే భార్యాబిడ్డలు, సిరిసంపదలతో సుఖంగా ఉండకుండా, చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జార విడుచుకోమంటారా? ధనం, బంగారం కలవాడే ప్రస్తుతం లోకంలో రాణించగలడు. కానీ, ముక్కుమూసుకుని, నోరుమూసుకుని, బక్కచిక్కి శల్యమైనవాడిని లోకం గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్పసుఖాలు. కాబట్టి నా రెండో బిడ్డను నేనడిగతినంత ధనం ఇచ్చే వారికే ఇచ్చి పెండ్లిచేస్తాను. కానీ, కన్యాదానం మాత్రం చేయను” అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు ఆ సన్యాసి ఆశ్చర్యపడి, తన దారిన తాను వెళ్లిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు. వెంటనే యమ భటులు వచ్చి, అతన్ని తీసుకుపోయిరి. యమలోకంలో అసిపత్రవనం అనే నరకంలో పారేశారు. అక్కడ అనేక విధాలుగా బాధించారు. సువీరుడికి పూర్వికుడైన శ్రుతుకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి, ధర్మాత్ముడై మృతిచెంది, స్వర్గాన్ని పొందాడు. అయితే ఆయన వంశజుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల శ్రుతుకీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి వచ్చాడు.  అంతట శ్రుతకీర్తి ”నేను ఒకరికి ఉపకారం చేశానే తప్ప అపకారమెన్నడూ చేయలేదు. దానధర్మాలు, యజ్ఞయాగాదులు చేశాను. అయినా.. నాకు ఈ దుర్గతి ఎలా?” అని నిండు కొలువులో యమధర్మ రాజును ప్రశ్నించాడు.
వినయంగా ఇలా చెబుతున్నాడు… ”ప్రభూ… నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి. ప్రాణకోటిని తరతమ తారతమ్య బేధాలు లేకుండా సమానంగా చూస్తావు. నేనెన్నడూ పాపం చేయలేదు. అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు? కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. దానికి యమధర్మరాజు శ్రుతకీర్తిని చూచి ”ఓయీ… నీవు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవే. నీవు ఎలాంటి దూరాచారం చేయలేదు. అయినా… నీ వంశీయుడైన సువీరుడు తన జేష్ఠ పుత్రికను అమ్ముకొన్నాడు. కన్యను అమ్ముకునే వారు, వారి పూర్వికులు ఎంతటి పుణ్యవంతులైనా… నరకాలను అనుభవించక తప్పదు. నీచజన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవే. అయితే నీకో మార్గం చెబుతాను. నీకు మానవ శరీరాన్ని ఇస్తాను. నీ వంశీయుడైన సువీరుడికి ఇంకో కుమార్తె ఉన్నది. ఆమె నర్మదానదీ తీరంలో తల్లివద్దే పెరుగుతున్నది. అక్కడకు పోయి, ఆ కన్యను వేద పండితుడు, శీలవంతుడికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయి. నీవు, మీవాళ్లు ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళ్తారు” అని చెప్పాడు. ”పుత్రికాసంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానంచేసినా, విధిగా ఆంబోతుకు వివాహం చేసినా కన్యాదాన ఫలం వస్తుంది. కావున నీవు భూలోకానికి వెళ్లి నేను చెప్పినట్లు చేయి. ఆ కార్యం కారణంగా పితృగణమంతా తరిస్తారు” అని యముడు సెలవిచ్చెను.
శ్రుతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని, నర్మదా నదీతీరంలో ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను, కుమార్తెను చూచి, సంతోషపడి, ఆమెతో అసలు విషయం చెప్పి, కార్తీక మాసంలో సువీరుడి కూతురిని కన్యాదానం చేశాడు. ఆ వెంటనే సువీరుడు, శ్రుతకీర్తి, వారి పూర్వీకులు పాపవిముక్తులై, స్వర్గలోకాన్ని చేరారు.
”ఓ జనకమహారాజా! కార్తీకంలో కన్యాదానానికి అంతటి శక్తి ఉంది. అత్యంత పుణ్యఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కార్తీకమాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణుసాన్నిధ్యాన్ని పొందుతాడు” అని వివరించాడు.

_*ఇతి శ్రీ స్కాంధపురాణాంతర్గత, వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య: త్రయోదశాధ్యాయ సమాప్త:*_
_*పదమూడో రోజు పారాయణం*_

Related Posts