పవన్ కల్యాణ్ ఇప్పుడు జగన్ ను లక్ష్యంగా చేసుకుని యాత్రలు చేస్తున్నారు. తమపై వస్తున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే పవన్ జగన్ పార్టీపై విమర్శలు పెంచినట్లు విశ్లేషణలు విన్పిస్తున్నాయి. నిజానికి పవన్ కల్యాణ్, జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరూ విపక్షానికి చెందిన వారే. ఇద్దరూ అధికారపార్టీని టార్గెట్ చేయాలి. పవర్ లో ఉన్న పార్టీని దుమ్మెత్తి పోయాలి. నిన్న మొన్నటి వరకూ అదే జరిగింది. పవన్ కల్యాణ్ తన పోరాట యాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై విరుచుకుపడేవారు. వారి అవినీతి ఇదిగో అంటూ విమర్శనాస్త్రాలు సంధించేవారు. కానీ గత కొద్దిరోజులుగా జగన్ పార్టీపై మాటల దాడిని పెంచడం వెనక బలమైన కారణం ఉందంటున్నారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా ఆయన ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే తాను 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఒకవేళ వామపక్ష పార్టీలతో పొత్తు ఉంటే అందులో కొన్ని సీట్లను వారికి కేటాయించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో తృతీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని పవన్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన లక్ష్యం నెరవేరకపోయినా 2024 నాటికి తన కల సాకారమవుతుందన్న నమ్మకంతో జనసేనాని ఉన్నారు.అందుకే ఆయన తొలినుంచి చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అధికార పార్టీలోనే ఎక్కువ లొసుగులుంటాయి కాబట్టి సహజంగానే నాలుగేళ్లు తాను మద్దతిచ్చినా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నానని బహిరంగంగా చెబుతున్నారు. అయితే ఉన్నట్లుండి జగన్ పై మాటల దాడి పెంచారు. ఇదుకు ప్రధాన కారణం తన వెనక ఉన్న వారిలో కొందరు నేతలు వైసీపీ ముఖ్యనేతలను కలవడమేనని చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేనలు కలసి పోటీ చేస్తాయనిప్రచారంజరుగుతుంది. ఇది అధికార పార్టీ చేస్తున్న ప్రచారమే అయినప్పటికీ ఎప్పటికప్పడు జగన్, పవన్ లు తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ప్రకటిస్తూ వస్తున్నారు. దగ్గరగా ఉన్న నేతలే కోవర్టులుగా మారారని తెలియడంతో పవన్ హర్ట్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై తన వెంట ఉన్న నేత ఒకరు వైసీపీ ముఖ్యనేతతో చర్చించినట్లు తెలియగానే ఆయనను పక్కనపెట్టేశారు. తనపై వైసీపీ ఏదో కుట్ర చేస్తుందని భావించిన పవన్ కల్యాణ్ జగన్ పై విమర్శలను ఉధృతం చేశారంటున్నారు. అయితే దీనికి కూడా ఎప్పటికప్పుడు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. జగన్ ను కులం పేరుతో సంభోదిస్తారా? అంటూ వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. నిన్న మొన్నటి దాకా ఎవరి పనిలో వారు ఉంటూ అధికారపార్టీ పై విరుచుకుపడే వైసీపీ, జనసేన పార్టీలు ఇప్పుడు ఉప్పునిప్పుగా మారడానికి ఆ నేతల భేటీయేకారణమనిచెబుతున్నారు.