ఆయన అనూహ్యంగా ఎంపీ అయిపోయారు. ఆయనకు సీటు ఇచ్చి ప్రోత్సహించినది వైఎస్సార్. 2009 ఎన్నికల టైంలో విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ హాట్ ఫేవరేట్ సీటుగా ఉండేది. అటువంటి చోట అప్పటికే కాంగ్రెస్ బహిష్కరణ అస్త్రం ఎదుర్కొంటూ పార్టీకి దూరంగా ఉంటున్న సబ్బం హరి అనే మాజీ మేయర్ ని నిలబెట్టి గెలిపించిన ఘనత అక్షరాలా వైఎస్ దేనని చెప్పాలి. అనూహ్యంగా వైఎస్ దుర్మరణం పాలయ్యాక సబ్బం హరి కుమారుడు వైఎస్ జగన్ పక్కకు వచ్చారు. ఆ తరువాత కొన్నాళ్ళకు పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరించిన కారణంగా అయన్ని సస్పెండ్ చేశారు.నాలుగున్నరేళ్ళుగా ఏ పార్టీతో సంబంధం లేకుండా ఉంటున్నట్లుగా చెప్పుకుంటున్నా హరి ఆలొచనలు, అడుగులు అన్నీ టీడీపీ వైపే సాగుతున్నాయి. ఆయన చంద్రబాబుని పొగడడానికే తరచూ మీడియా ముందుకు వస్తున్నారు. మళ్ళీ బాబే సీఎం కావాని జనం కోరుతున్నారని కూడా హరి ఉచిత ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీలో హరి చేరాలనుకుంటున్నా ఆయన రాక పట్ల జిల్లా టీడీపీలోని పెద్ద తలకాయలు అభ్యంతరం పెడుతున్నాయి.అయితే హరి మాత్రం టీడీపీలోని సీనియర్ల కంటే కూడా బాబును బాగా వెనకేసుకువస్తున్నారు. ఏపీలో ఏ చిన్న ఘటన జరిగినా హరి మీడియా ముందుకు వచ్చి బాబుదేం తప్పు లేదని తీర్పులు ఇచ్చేయడం పరిపాటిగా మారింది. వైసీపీ నుంచి బయటకు రావడంతో సహజంగానే అయనకు జగన్ మీద కోపం ఉంటుంది. దాన్ని ఈ రూపంలో తీర్చుకోవడం ద్వారా అత్మ తృప్తిని, బాబును మచ్చిక చేసుకోవడం ద్వారా రాజకీయ లాభాన్ని పొందాలనుకుంటున్నారు.కోడి కత్తితో జగన్ మీద జరిగిన హత్యాయత్నం ఘటన చాలా చిన్నదని, ఆ నిందితుడు జగన్ అభిమాని అని, తెలియనితనంతో చేశాడని హరి ఏకంగా ఇపుడు తీర్పే చెప్పేశారు. . పైగా చంద్రబాబు ప్రమేయం ఈ ఘటనలో అసలు లేదని కూడా చెప్పుకొచ్చారు. ఇది కేవలం జగన్ సానుభూతి కోసం ఆడుతున్న డ్రామాగా పేర్కొంటున్నారు. మరి ఈ విధంగా టీడీపీ మాటను తన నోట పలుకుతూ బాబును, టీడీపీని పూర్తిగా వెనకేసుకొస్తున్న హరికి పసుపు పార్టీలో ప్రవేశం ఎపుడు అని ఆయన అనుచరులే అడుగుతున్నారు. ఆ పనేదో తొందరగా చేస్తే ఆయన్ని టీడీపీ మనిషిగా పూర్తిగా జమ చేసుకుంటామని వైసీపీ అంటోంది. అన్నట్లు హరి అనకాపల్లి ఎంపీ లేదా విశాఖ ఉత్తరం అసెంబ్లీ సీటు కోరుతున్నారట. మరి బాబు దయ తలచేనా…