YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భిక్షమెత్తుకుని మరీ టాయిలెట్‌ నిర్మించుకున్న అమీనా

భిక్షమెత్తుకుని మరీ  టాయిలెట్‌ నిర్మించుకున్న అమీనా

- అధికారులకు చెంపపెట్టులా

బిహార్‌కు చెందిన ఓ మహిళ. భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న అమీనా ఖటూన్‌ (40) అత్యంత పేదరికాన్ని  సైతం ఎదిరించి టాయిలెట్‌ నిర్మాణం పూర్తి చేసిన వైనం  ప్రముఖంగా నిలిచింది. సంకల్ప సిద్ధికి, నిబద్థతకు  నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం ఎలా వున్నప్పటికి.. ఆమె సంకల్పానికి మాత్రం  స్థానికులు, అధికారులు జేజేలు పలికారు.  అంతేకాదు స్వచ్ఛ్‌ భారత్‌ పథకం కింద  మరుగుదొడ్డి నిర్మాణం కోసం ఆశ్రయిస్తే ఉదాసీనత ప్రదర్శించిన అధికారులకు చెంపపెట్టులా  ఆ పనిని పూర్తి చేసి.. వారి  ప్రశంసలందుకోవడం విశేషం.

సౌపాల్‌ జిల్లా పత్రా  గ్రామానికి చెందిన అమీనా స్వచ్ఛ్‌ భారత్‌ పథకం కింద టాయిలెట్‌ నిర్మించుకునేందుకు అధికారులను ఆశ‍్రయించారు.  పలుమార్లు  సంబంధిత అధికారులు చుట్టూ తిరిగినా వారు పెద్దగా పట్టించుకోలేదు.  దీంతో తానే స్వయంగా రంగంలో దిగి చుట్టుపక్కల గ్రామాల్లో భిక్షమెత్తుకుని మరీ తన ఇంట్లో టాయిలెట్‌ నిర్మించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆమె పట్టుదలకు మద్దతుగా నిలిచిన గ్రామస్తులు, ఇతర కార్మికులు టాయిలెట్‌ నిర్మాణ పనులను ఉచితంగా చేసిపెట్టేందుకు  ముందుకు వచ్చారు. అయితే   విషయం తెలుసుక్ను  జిల్లా అధికారులు ఆదివారం ఆమెను ఘనంగా సన్మానించారు. ఒక  చిన్న పిల్లవాని తల్లి, తన జీవనోపాధికోసం కార్మికురాలిగా పని చేస్తున్న నిరుపేద  మహిళ చేసిన ప్రత్యేక ప్రయత్నం పట్ల అభినందనలు తెలిపారు.

మరోవైపు  బిహార్‌ రాష్ట్రంలో స్వచ్ఛ భారత్‌ లక్ష్యం అమలులో దిగువ స్థాయిలో ఉంది. లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ  బహిరంగ మలమూత్ర విసర‍్జన పద్ధతినే అనుసరిస్తున్నారు.  అయితే, అక్టోబర్ 2, 2019 నాటికి బీహార్‌ను  ఓడీఎఫ్‌గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. కానీ...ఒక్క జిల్లాగా కూడా ఓడీఎఫ్‌ (ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ) గా ప్రకటితం కాకపోవడం గమనార్హం. కాగా మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా,  2014,  అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా   దేశవ్యాప్తంగా    స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

 

Related Posts