ఆయన వెండి తెర మెగా స్టార్. ఎంపీగా ఆయనకు మంగళవారమే ఆయనకు చివరి రోజు. అదేమిటి చివరి రోజేమిటీ, దేనికి, ఎందుకు అని కంగారుపడుతున్నారా? కంగారు పడక్కర్లేదు. రాజ్యసభ సభ్యుడిగా మంగళవారం సాయంత్రంతో మెగాస్టార్ పదవీ కాలం పూర్తయింది. ఇక బుధవారం నుంచి మెగాస్టార్ మాజీ ఎంపీ. పదవితో మేలు చేయవచ్చునని ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఎన్నికల ముందు బొక్క బోర్లా పడ్డారు. అధికారం మాట దేవుడెరుగు కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా నిలబడలేకపోయారు. సమైక్యరాష్ట్రంలో 290 స్దానాలుంటే కేవలం 18 స్థానాలలోనే గెలిచి ఉసూరనిపించారు. ఎన్నికల తర్వాత ప్రజారాజ్యం జెండా ఎత్తేసి కాంగ్రెస్ ఇచ్చిన మంత్రి పదవి, రాజ్యసభ ఆఫర్‌తో చేతిలో చెయేసారు.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఓ వెలుగు వెలిగారు. రాజ్యసభ సభ్యుడిగా ఆరు సంవత్సారాల పదవి కాలంలో చిరంజీవి తెలుగు ప్రజలకు చేసింది శూన్యమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన పుట్టి పెరిగిన ఆంధ్రప్రదేశ్ కు కూడా చిరంజీవి చేసిన మేలు ఏమి లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిరంజీవి పేరు కూడా వినిపించడం మానేసింది. రాజ్యసభ సభ్యుడిగా తనకు వచ్చే నిధులతో తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా అభివృద్ది చేసే అవకాశం ఉంటుంది. పాఠశాలలు కట్టించడమో, బస్సు షెల్టర్లు నిర్మించడమో, నిరుపేదలకు పక్క ఇళ్లు నిర్మించడమో, గ్రామాలలో మంచి నీటి వసతి కల్పిచడమో, మరుగుదొడ్లు నిర్మించడమో ఇలా ఏదో ఒకటి చేయవచ్చు. కానీ చిరంజీవి అలాంటి పనులు చేసిన దాఖలాలు లేవంటున్నారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు ఒనగూరే ప్రయోజనాలను అనుభవించారే తప్ప, ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మెగా స్టార్ చిరంజీవి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైన మేలు జరిగిందా అంటే అదీ సూన్యమే అంటున్నారు. ఓ పార్టీ వ్యవస్దాపకుడిగా, మరో పార్టీ రాజ్యసభ్య సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా చిరంజీవి చేసినది ఏ ఒక్కటీ లేకపోవడం విశేషం. ప్రజల మాట పక్కనే పెడ్డితే తనకు తానుగా చెప్పుకుందుకు కూడా “చిరు” ప్రయోజనం కూడా లేదని రాజకీయ పండితులు వ్యాఖ్యనిస్తున్నారు. సరే రాజ్యసభ సభ్యత్వం ముగిసింది. ఇక చిరంజీవి రాజకీయ భవిష‌్యత్తు ఎలా ఉంటందో….. ఏమవుతుందో కాలమే నిర్ణయించాలి