2017 దసరా ఉత్సవాలకు రూ.14 కోట్లు ఖర్చు అయ్యాయని, ఈ ఏడాది ఈ ఖర్చును రూ.8 కోట్లు కుదిస్తున్నామంటూ దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మ దసరా ఉత్సవాలకు ముందు ప్రకటించారు. అయితే వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.ఏడాది ఉత్సవాలకు రూ.6.65 కోట్లు ఖర్చు అయితే ఈ ఏడాది ఉత్సవాలకు రూ.8 కోట్లు ఖర్చయిందని, అందువల్ల ఈ ఏడాది దేవస్థానానికి మిగిలింది ఏమీటంటూ ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు అధికారులను ప్రశ్నించారు. దేవస్థానానికి ఖర్చులు తగ్గనప్పుడు మీడియాలో ఖర్చులు నియంత్రించామని చెప్పాల్సిన అవసరం ఏమీ వచ్చిందంటూ సభ్యులు అధికారులను నిలదీశారు. గత ఏడాది రూ.14 కోట్లు ఖర్చు చేయకుండా చేశామని చెప్పడం ఏమీటంటూ ప్రశ్నించినట్లు తెలిసింది.ఉలిక్కిపడ్డ అకౌంట్ విభాగం అధికారులు లెక్కల్ని తారు మారు చేశారు. గత ఏడాది దసరా ఉత్సవాలకు రూ.13.62 కోట్లు ఖర్చయినట్లు లెక్కలు తయారు చేసి మీడియాకు విడుదల చేశారు. ఇందులో పూజా సామాగ్రి, ప్రొవిజన్స్‌కు రూ.4.06 కోట్లు, ఇంజినీరింగ్ వర్క్స్కు రూ.2.78 కోట్లు, ఇతర ఖర్చుల కింద రూ.2.78 కోట్లు చూపించారు. మిగిలిన సొమ్ములో వివిధ శాఖలకు చెల్లించిన ఖర్చుల్ని వివరిస్తున్నారు అకౌంట్ విభాగం లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత ఈ ఏడాది దసరా ఖర్చులు సుమారు రూ. 8 కోట్లు అయ్యాయని, అందులో రూ.5 కోట్ల వరకు చెల్లించామని, మిగిలినవి చెల్లించాల్సి ఉందంటూ అధికారులు లెక్కలు చెప్పారు. దీంతో గత ఏడాది అంత ఖర్చు ఎందుకయ్యిందనే ప్రశ్నలు మొదలయ్యాయి.ఏడాది దసరా ఉత్సవాలకు, ఈ ఏడాది దసరా ఉత్సవాలకు పాలకమండలి ఉంది. దీంతో గత ఏడాది ఎక్కువ ఖర్చులు ఎందుకు అయ్యాయి. ఈ ఏడాది ఎక్కడ తగ్గాయనే అంశంపై పాలకమండలి ఆరా తీసింది. గత ఏడాది రూ. 6.65 కోట్లు ఖర్చు చేశామంటూ అకౌంట్స్ విభాగం అధికారులు లిఖిత పూర్వకంగా పాలకమండలికి తెలియజేశారు.మొదలైంది వివాదం..అయితే పాలకమండలికి ఒక లెక్కలు, మీడియాకు మరొక లెక్కలు చెప్పాల్సిన అవసరం అకౌంట్స్ విభాగానికి ఎందుకు వచ్చిందనే అంశం ఆదాయ పన్నుశాఖ నుంచి వచ్చిన ఈవో కోటేశ్వరమ్మ తేల్చాల్సి ఉంది. రెండు రకాల లెక్కలు చెబుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గత ఏడాది అసలు ఖచ్చితంగా ఎంత ఖర్చయిందో కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.