తెలంగాణలో వారి పార్టీ దుకాణాలను వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లు మూసివేశారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీని జగన్, పవన్ లు ఒక్క మాట కూడా అనడం లేదని విమర్శించారు. మోదీతో వీరిద్దరూ లాలూచీ పడ్డారని అనుకోవాలా? లేక ఆయనకు భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. ఏపీకి మోదీ తీరని ద్రోహం చేశారని... ఆలస్యంగానైనా టీడీపీ మేల్కొందని, ఇతర పార్టీలు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాయని అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, లేకపోతే రాష్ట్రంలో అడుగుపెట్టనని రాహుల్ గాంధీ చెప్పారని రఘువీరారెడ్డి గుర్తు చేశారు. కేంద్రంలో వచ్చే ప్రభుత్వంపైనే ఏపీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. దేశ అవసరాల కోసం ఏ పార్టీతోనైనా జతకడతామని చెప్పారు. ఏపీలో పొత్తులపై ఇంకా చర్చ జరగలేదని అన్నారు.