ప‌్రముఖ సినీ నటి రమ్యశ్రీకి నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందించింది. సినీ నటిగా, దర్శక నిర్మాతగా ఆమె కళారంగానికి అందించిన సేవలతో పాటు నిరుపేద, వృద్ధ, నిరాశ్రయులకు అందించిన సేవలకు ఈ పురస్కారాన్ని అందించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఫిలాంథ్రోపిక్ సొసైటీ రమ్యశ్రీకి అమరావతి నేషనల్ ఎక్సెలెన్సీ అవార్డు ప్రదానం చేశారు. విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్ హాల్ లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు అందించారు. రమ్య హృదాలయ ఫౌండేషన్ ద్వారా పదేళ్ళ నుంచి యాచకుల నుంచి వృద్ధులు, వికలాంగుల వరకు అందరికీ రమ్యశ్రీ అందించిన సేవలను విశేషంగా అభినందించారు. సినీ నటిగా రాణిస్తూ, సామాజిక బాధ్యతగా రమ్యశ్రీ మెడికల్ క్యాంపులు, క్యాన్సర్ పై చైతన్యం, బీపీ, సుగర్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు వందల సంఖ్యలో నిర్వహించారు. రమ్య హృదయాల ఫౌండేషన్ రమ్యమైన హృదయంతో ఈ కార్యక్రమాలను నిర్వహించిందని కొనియాడారు. రమ్యశ్రీ 350 సినిమాలు, తెలుగు, కన్నడ, తమిళ, మళయాళం, ఒడిస్సీ, భోజ్ పురి, పంజాబీ భాషా చిత్రాల్లో నటించారు. ఆమె డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా నిర్మించిన ఓ మల్లి సినిమాకు స్పెషల్ జ్యూరీ రాష్ట్ర నంది అవార్డులు రెండు వచ్చాయి. బెస్ట్ హీరోయిన్, బెస్ట్ డైరెక్టర్ గా ఆమె మన్ననలు పొందారు. కన్నడలో ఆర్యభట్ట చిత్రానికి నటిగా జాతీయ అవార్డు లభించింది. ఆమె సామాజిక సేవలకు మదర్ థెరెస్సా అవార్డు కూడా వచ్చింది. నటిగా మన్ననలు పొందడమే కాకుండా, సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహించగలగడం తన పూర్వజన్మ సుకృతమని రమ్యశ్రీ పేర్కొన్నారు.