సినీ పరిశ్రమలో 'మీ టూ' ఉద్యమం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమం దెబ్బకు నటులు నానపటేకర్, అలోక్ నాథ్ లతో పాటు దర్శకుడు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ లు కీలక ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. తాజాగా ఈ ఉద్యమంపై మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్పందించారు. అయన మీడియాతో మాట్లాడుతూ వారు మీటూ ఉద్యమంపై అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ..‘మలయాళ ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యా లేదు. లైంగిక వేధింపులు అన్నవి ప్రతిచోటా ఉంటాయి. అవి కేవలం సినీ పరిశ్రమలోనే ఉంటాయనుకోవడం కరెక్ట్ కాదు. అయినా మీటూ ఆరోపణలు చేయడమన్నది ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. ఇలాంటివి ఎక్కువకాలం నిలబడవు. మూణ్ణాళ్ల ముచ్చటగానే అవుతాయి’ అని అయన అన్నారు.మీటూ ఉద్యమంపై వ్యక్తిగతంగా తాను కామెంట్ చేయబోనని మోహన్ లాల్ స్పష్టం చేశారు. మరోవైపు లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దిలీప్ ఈ వేడుకలకు హాజరుకాబోడని తేల్చిచెప్పారు. అతను అసోసియేషన్ ఆఫ్ మలయాళం మువీ ఆర్టిస్ట్స్(అమ్మ)లో సభ్యుడు కాదని వ్యాఖ్యానించారు.