ప్రధాని మోదీ తన నాలుగురోజుల పర్యటనలో భాగంగా మస్కట్‌లోని మత్రాహ్ ఏరియాలో ఉన్న 125 ఏళ్ల పురాతన శివాలయాన్ని సందర్శించారు. ఆలయంలో పూజలు చేసిన అనతరం వెలుపలే వేచియున్న భారతీయ సంతతికి చెందిన వారితో ఆయన ముచ్చటించారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అతి పురాతన ఆలయాల్లో ఈ శివాలయం ఒకటి. ఒమన్ సుల్తాన్ ప్యాలెస్‌కు సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని గుజరాత్‌కు చెందిన వ్యాపార వర్గాలు 125 ఏళ్ల క్రితం నిర్మించారు. 1999లో దీనిని పునరుద్ధరించారు. ఈ ఆలయంలో ప్రధాన దేవతామూర్తులుగా శ్రీ ఆది మోతీశ్వర్ మహదేవ్, శ్రీ మోతీశ్వర్ మహదేవ్, శ్రీ హనుమాన్‌జీ ఉన్నారు. పండుగలు, ప్రధాన ఉత్సవాల్లో ఈ ఆలయాన్ని 15,000 మందికి పైగా భక్తులు దర్శిస్తుంటారు. ఆలయ దర్శనానంతరం సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును సందర్శించేందుకు మోదీ వెళ్లారు. ఇవాళే ఆయన తిరిగి ఇండియాకు పయనమవుతున్నారు.