కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరాలు కురిపించింది. కాంట్రాక్టు ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 60కి పెంచుతున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.యనమల అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులకు సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని ఉప సంఘం నిర్ణయించింది. ఇప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగులకు 10 నెలల వేతనాన్ని ఇస్తున్నారని, ఇకపై 12 నెలలకు పెంచుతున్నట్లు సమావేశం అనంతరం మంత్రి మీడియాకు తెలిపారు. మహిళా ఉద్యోగులకు 6 నెలలు ప్రసూతి సెలవులు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘంలో నిర్ణయించామన్నారు. ఈ విషయాన్ని మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలుపుతామని గంటా పేర్కొన్నారు. సమీక్షలో మంత్రులు ఫరూక్, నారాయణ, గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ మేరకు త్వరలో తీపి కబురు అందనుంది. ఉప సంఘం తీసుకున్న నిర్ణయాల ప్రకారం మహిళలకు 180 రోజులు మెటర్నటీ సెలవులు ఇస్తారు. ప్రభుత్వంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతారు. అధ్యాపకులకు ప్రస్తుతం పది నెలలకు మాత్రమే జీతం ఇస్తున్నారు. దానిని 12 నెలలకు పెంచుతారు. అయితే ప్రతి ఏడాది పది రోజులు బ్రేక్ ఇస్తారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తారు. ఈ రోజు తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల వైద్య, ఆరోగ్య శాఖలో 23,372 మందికి, ఉన్నత విద్యా శాఖలో 3,802 మందికి లబ్డి చేకూరుతుంది. అందరికీ డీఏ లేకుండా ఎంటీసీ వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఉన్నత విద్యాశాఖపై రూ.38 కోట్ల అదనపు భారం పడుతుంది. అయితే వివిధ శాఖలలో పని చేసే కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఒకే విధానం అనుసరించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించమని మంత్రి యనమల అధికారులను ఆదేశించారు. ఆంధ్రా యూనివర్సిటీలోని 28 రోజుల ఉద్యోగులు, ఎన్ఎంఆర్ ల సమస్యల గురించి కూడా సమావేశంలో చర్చించారు.