- కర్నాటకలో ముమ్మరం చేసిన ఎన్నికల ప్రచారం
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం ముమ్మరం చేశారు. ప్రస్తుతం అక్కడ ‘జన ఆశీర్వాద యాత్ర’లో ఉన్న ఆయన... ఇవాళ మధ్యాహ్నం రోడ్డు పక్కన ఓ చిన్న హోటల్ దగ్గర ఆగారు. స్థానిక నేతలతో కలిసి మిర్చి పకోడా (స్థానికంగా వీటిని భజ్జీలు అని పిలుస్తారు...) తిని, టీ తాగారు. దీంతో ఇవాళ రాయ్‌చూర్‌లోని కల్మల గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీ, ఆయనతో పాటు ఉన్న కాంగ్రెస్ నేతలకు హోటల్ యజమాని మారమ్మ మిర్చి బజ్జీలు, మరమరాలు వడ్డించారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మల్లిఖార్జున ఖర్గే, కర్నాటక కాంగ్రెస్ ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్, మంత్రి డీకే శివకుమార్ తదితరులు రాహుల్ గాంధీతో పాటు ఉన్నారు.
పకోడీలు అమ్మడం కూడా ఉద్యోగమేనంటూ ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఆగి మరీ మిర్చి పకోడాలు తినడంపై ఆసక్తికర చర్చ సాగింది. కాగా ఇవాళ ఉదయం రాహుల్ సీఎం సిద్ధరామయ్యను వెంటబెట్టుకుని రాయ్‌చూర్‌లోని దర్గాను దర్శించారు. అనంతరం నగరంలో రోడ్‌షో నిర్వహించారు.