YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పర్సనల్ ఇమేజ్ నల్లారికి దిక్కా..

పర్సనల్ ఇమేజ్ నల్లారికి దిక్కా..
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ రాజకీయంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆయన వెంట పెద్దగా నేతలు ఎవరూ కలసి రావడం లేదు. దీంతో ఆయన ఒంటరిగానే తానేంటో నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నట్లే కన్పిస్తోంది. ఆయన వరుసగా జిల్లాల పర్యటన చేస్తుండటం ఇందుకు ఊతమిస్తుంది. ఇటీవల అనంతపురం జిల్లాలో పర్యటించిన కిరణ్ కుమార్ రెడ్డి రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. పార్టీని బలోపేతం చేయడం కోసం కాకుండా కిరణ్ పర్యటనలు వ్యక్తిగతంగా తన బలం పెంచుకోవడానికే సాగుతున్నట్లు విమర్శలు కాంగ్రెస్ పార్టీలోనే విన్పిస్తున్నాయి.వచ్చే ఎన్నికలలో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో దిగాలని భావిస్తున్నారు. అక్కడ ప్రథాన ప్రత్యర్థి వైసీపికి చెందిన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిధున్ రెడ్డితో వచ్చే ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి తలపడాల్సి ఉంటుంది. పెద్దిరెడ్డి కుటుంబానికి, నల్లారి కుటుంబాల మధ్య దశబ్దాల రాజకీయ వైరం ఉంది. నిజంగానే కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగితే మరోసారి రెండు కుటుంబాల మధ్య రాజకీయపోరు రసవత్తరంగా మారనుంది.వచ్చే ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సత్సంబంధాలు నెలకొల్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా రాజంపేట పార్లమెంటు సీటును కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చే విషయంలో చంద్రబాబు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పబోరు. అంతేకాకుండా నల్లారికిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ లో క్రియాశీలకంగా మారారు. పీలేరు నియోజకవర్గం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికలలో టీడీపీ తరుపున బరిలో దిగనున్నారు. ఆయన పర్యటనలు సాగుతున్నట్లు చెబుతున్నారు. సోమవారం ఆయన నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని చిత్తూరు జిల్లా కలికిరిలో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటు స్థానంపైనే ప్రధానంగా చర్చించినట్లు చెబుతున్నారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నల్లారి కుటుంబానికి కూడా పట్టు ఉండటంతో గెలుపు సాధ్యమవుతుందని ఆయన భావిస్తున్నారు. దీంతో పాటు టీడీపీ బలం కూడా తోడయి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడించడమే లక్ష్యంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి నల్లారి ఆశలు ఫలిస్తాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts