YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు వైసీపీలో పోరు షురూ

కర్నూలు వైసీపీలో  పోరు షురూ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పోరాటం షురూ అయిందనే చెప్పాలి. ఎన్నికలు ఇంకా ఆరునెలలు ఉండగానే ఎన్నికల ప్రచారాన్ని నేతలు అప్పుడే ప్రారంభించారు. ముఖ్యంగా రాయలసీమ వైఎస్సార్ కాంగ్రెస్ లో ఈ ప్రభావం ఎక్కువగా కన్పిస్తోంది. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న ఆత్మవిశ్వాసంతో ఉన్న వైసీపీ నేతలు ప్రజల చెంతకు చేరువయ్యేలా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలను ఒకవైపు,ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మరోవైపు నిత్యం జనంలో ఉండేలా…నలిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర తర్వాత పార్టీలో మరింత జోష్ పెరిగిందనే చెప్పాలి. కర్నూలు జిల్లాను తీసుకుంటే గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ బలం ఏంటో చెప్పకనే తెలిసింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని టీడీపీని జిల్లాలో చావుదెబ్బతీసింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు పార్టీని వీడారు. అయినా ఇప్పటికీ కర్నూలు జిల్లాలో వైసీపీ ఓటు బ్యాంకు పదిలంగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే టిక్కెట్ల కోసం ఇప్పటి నుంచే నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా పాణ్యం నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ టిక్కెట్ ఎవరి వస్తుందోనన్న టెన్షన్ నేతల్లో నెలకొని ఉంది.నిజానికి గత ఎన్నికల్లో వైసీపీయే పాణ్యంలో విజయం సాధించింది. గౌరు చరితారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కాటసాని రాంభూపాల్ రెడ్డి పై దాదాపు 11 వేలకు పైగా ఓట్లతో విజయంసాధించారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏరాసు ప్రతాప్ రెడ్డి మూడోస్థానానికే పరిమితమయ్యారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి ఐదు సార్లు గెలిచిన చరిత్ర ఉంది. గత ఎన్నికల్లోనూ ఆయన రెండోస్థానంలో నిలిచారంటే ఆయన వ్యక్తిగత ఇమేజ్ తప్ప మరేదీ కాదన్నది అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత కాటసారి రాంభూపాల్ రెడ్డి బీజేపీలో చేరి ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోయారు. కాటసాని రాకతో పాణ్యం నియోజకవర్గంలో ఇక వైసీపీకి తిరుగుండదు. గణాంకాలను బట్టి చూసినా, వ్యక్తిగత ఇమేజ్ ను బట్టి చూసినా గౌరు, కాటసాని కుటుంబాలు ఏకమైతే ప్రత్యర్థి దరిదాపుల్లో కూడా ఉండరు. పార్టీలో చేరిన కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇటీవల పాణ్యం నియోజకవర్గంలో తిరుగుతుండటం గౌరు చరిత వర్గంలో కొంత అయోమయాన్ని సృష్టిస్తోంది. జగన్ మాత్రం కాటసాని రాంభూపాల్ రెడ్డిని నంద్యాల పార్లమెంటు బరిలో దింపాలని భావిస్తున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. అయినా కాటసాని పాణ్యం నియోజకవర్గాన్ని టార్గెట్ గా చేసుకుని తిరుగుతుండటంతో గౌరు వర్గం జగన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. తాము పార్టీని నమ్ముకుని ఉన్నప్పటకీ తమకు టిక్కెట్ దక్కదన్న ప్రచారం నియోజకవర్గంలో ఒక వర్గం కావాలని చేస్తుందని గౌరు వర్గం అభిప్రాయపడుతోంది. ఈ పంచాయతీకి వీలయినంత త్వరగా ఫుల్ స్టాప్ జగన్ పెట్టకుంటే పాణ్యం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెనుమార్పులు తప్పవంటున్నారు. మరి జగన్ ఈ సమస్యను వీలయినంత త్వరగా పరిష్కరించుకుంటేనే మంచిది.

Related Posts