టీవల జరిగిన ఉప ఎన్నికలతో యడ్యూరప్ప ప్రభ మసకబారింది. ఫలితాలు తిరగబడటంతో యడ్డీ నాయకత్వంపైనే అనుమానాలు పొడచూపాయి. ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో యడ్యూరప్ప సొంత నియోజకవర్గమైన శివమొగ్గలోనూ చచ్చీ చెడీ గెలవడం అధిష్టానానికి ఆగ్రహం తెప్పించిందంటున్నారు. దీనిపై పార్టీ కేంద్ర నాయకత్వం ఉప ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని కూడా కోరింది. ఇప్పటికే కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర శాఖ నుంచి నివేదిక కూడా అందింది. యడ్యూరప్ప ను రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించే సాహసం కేంద్ర నాయకత్వం చేయబోదన్న వార్తలు వస్తున్నాయి. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్ప బలమైన నేత. గత కొన్ని దశాబ్దాలుగా కన్నడ రాజ్యంలో కమలం పార్టీ జెండా ఎగురుతుందంటే అది ఆయన బలమే కారణమని చెప్పకతప్పదు. తన సామాజిక వర్గం ఓటు బ్యాంకును పదిలంగా ఉంచుకోవడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసిన వ్యక్తి యడ్డీయే అన్నది కేంద్ర నాయకత్వం కూడా అంగీకరించక తప్పని పరిస్థితి. గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకపోయినా యడ్డీ కారణంగానే అతిపెద్ద పార్టీగా రాష్ట్రంలో అవతరించిందన్నది అందరూ అంగీకరించే విషయమే. గత ఎన్నికల్లో యడ్యూరప్ప ఒంటిచేత్తోనే పార్టీని నడిపారు. మోదీ, అమిత్ షాలు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచార శైలి వరకూ కేంద్ర నాయకత్వం యడ్యూరప్పకే అప్పగించింది. అయితే పెద్ద పార్టీగా అవతరించినా అధికారానికి అడుగు దూరంలో మిగిలిపోయింది. కానీ ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో బళ్లారి వంటి సిట్టింగ్ స్థానాన్ని పోగొట్టుకోవడంతో యడ్డీ పదవికి ఇబ్బంది తప్పదన్న ఊహాగానాలు చెలరేగాయి చివరకు కేంద్ర నాయకత్వం వచ్చే లోక్ సభ ఎన్నికలకు యడ్డీ నేతృత్వంలోనే వెళ్లాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. బలమైన సామాజికవర్గం నేత కావడం, యడ్డీకి ప్రత్యామ్నాయ నేత ఎవరూ లేకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకుందన్నది వాస్తవమే. లోక్ సభ ఎన్నికలకు ముందు యడ్డీని మార్చినా పెద్దగా ఉపయోగం ఉండదన్నది కేంద్ర నాయకత్వం తేల్చింది. అధికార పార్టీకే ఉప ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉంటాయని కేంద్రనాయకత్వం భావించి యడ్యూరప్ప మీనేత అంటూ రాష్ట్ర బీజేపీనేతలకు సందేశం పంపింది. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లనే యడ్డీని కంటిన్యూ చేశారన్న వార్తలూ విన్పిస్తున్నాయి. మొత్తం మీద మరోసారి యడ్డీ నాయకత్వంలోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకి ఏ మేరకు మేలు చేస్తుందో వేచి చూడాలి