- బస్సులో యువకుడి అసభ్యప్రవర్తనపై ఢిల్లీ యువతి ఫిర్యాదు
దేశరాజధాని నగరంలో 21ఏళ్ల యువకుడు తన వికృతచేష్టలతో ఓ యువతిని లైంగికంగా వేధించాడు. బస్సులో ప్రయాణిస్తున్న తనను లైంగిక వేధించాడంటూ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై వాసంత్ విహార్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నెల 7న డీటీఎస్ బస్సులో చోటుచేసుకోగా, ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ ఎవరని అరెస్టు చేయలేదు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ (హానర్స్) ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతి కాలేజీ నుంచి డీటీఎస్ బస్సులో ఇంటికి వెళుతోంది. కదులుతున్న బస్సులో తన సీటు పక్కనే కూర్చొన్న ఓ 21ఏళ్ల యువకుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అతని తీరును చూసి భరించలేక దూరంగా ఆ యువతి మరో సీటులోకి వెళ్లగా అక్కడికి కూడా వచ్చి మళ్లీ అదే పని చేయసాగాడు.
బస్సు సీట్లో కూర్చొని ఆ యువకుడు తనపై బ్యాగ్ పెట్టుకుని ప్యాంట్ విప్పి ఆమెకు మాత్రమే కనిపించేలా (మర్మాంగాన్ని బయటకి చూపిస్తూ హస్తప్రయోగం) చేసిన నికృష్ట చేష్టలతో తీవ్ర అసహనానికి గురైంది. వెంటనే బస్సులో పైకిలేచి లైంగికంగా తనను వేధిస్తున్నాడంటూ అరచి గోల చేసినప్పటికీ ఆమె మాటలు అర్థం కాక ఎవరూ కూడా ముందుకు రాలేదు. చివరికి ఆ యవకుడు గోల చేయకండి.. అరవకండి.. అంటూ నెమ్మదిగా బస్సు నుంచి దిగి వెళ్లిపోయినట్టు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన మొత్తం వీడియోను రికార్డు చేసానని, దీని ఆధారంగా అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. బాధితురాలు యువకుడి వికృత చేష్టలు మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇప్పుడా ఆ వీడియో వైరల్ అవుతోంది.