అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ ఎంపీ రవీంద్ర కుశ్వారా వెల్లడించారు. ఒకవేళ ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకపోతే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికీ అయోధ్య కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మందిర నిర్మాణం కోసం చట్టం తీసుకురావాలని హిందుత్వ గ్రూపులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే డిసెంబర్ 11నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు పెట్టి తీరతామని ఎంపీ కుశ్వార చెప్పడం గమనార్హం. పార్లమెంట్‌లో ఈ బిల్లుపై చర్చ జరుగుతుందని, అప్పుడే ఏ పార్టీ మందిరాన్ని కోరుకుంటున్నదో, ఏది వ్యతిరేకిస్తున్నదో తెలుస్తుందని ఆయన అన్నారు. లోక్‌సభలో కచ్చితంగా బిల్లు పాసవుతుందని, రాజ్యసభలో బీజేపీకి సరిపడా బలం లేకపోవడం వల్ల అక్కడ పాసవుతుందో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు.కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం విషయంలో బీజేపీ సరైన దిశలో అడుగులు వేయడం లేదని విమర్శించారు. యూపీలో, కేంద్రంలో, రాష్ట్రపతి భవన్‌లోనూ బీజేపీ హవా నడుస్తున్నదని, వీలైనంత త్వరగా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించేందుకు కేంద్రం ఓ చట్టాన్ని తీసుకురావాలని రౌత్ కోరారు.బాబ్రీ మసీదును కూల్చేందుకు కేవలం 17నిమిషాలే పట్టిందని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. కానీ అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం బీజేపీ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే.. త్వరలో అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నవారు, మునుముందు దేశంలో తిరిగేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. బాబ్రీ మసీదును కూల్చేందుకు 17 నిమిషాలు పడితే, మరి ఆలయ నిర్మాణం కోసం చట్టాన్ని చేయడానికి ఎంత సమయం పట్టాలని రౌత్ ప్రశ్నించారు. రామ మందిర నిర్మాణం కోసం ఇంకెన్ని ఎన్నికలు కావాల్సి వస్తుందని థాకరే ప్రశ్నించనున్నారు. హర్ హిందూకీ యహీ పుకార్.. పెహ్లీ మందిర్ ఫిర్ సర్కార్ అన్న నినాదాన్ని ఉద్దవ్ వినిపించనున్నారు.