ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని అవినీతి ఉద్యోగులపై కేసుల నమోదుకు ఏపీ ఏసీబీ సిద్ధమవుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు లేదా లంచం అడిగినట్లు ఫిర్యాదులు అందితే వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసింది. విజయవాడలోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో డీజీపీ, ఏసీబీ ఇన్‌ఛార్జి డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది ప్రధానంగా సీబీఐకి సాధారణ సమ్మతి నిరాకరించిన అంశంపైనే చర్చించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసేందుకు ఏసీబీకి ఉన్న అధికారాలు, తదుపరి దశలో విచారణకు అనుమతి తీసుకునేందుకు ఎలా వ్యవహరించాలి? అనే అంశాలను పరిశీలించారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం రాష్ట్ర ఏసీబీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టొచ్చని తేల్చారు. సీబీఐకి రాష్ట్రంలో ప్రవేశించేందుకు అవకాశం లేనందున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపైనా దృష్టి సారించాలని నిర్ణయించినట్లు సమాచారం.ఇప్పటివరకు కేంద్ర ఉద్యోగులపై సీబీఐ మాత్రమే దాడులు నిర్వహించేది. అయితే... సీబీఐకి సాధారణ అనుమతి రద్దు నేపథ్యంలో ఏసీబీ చర్యలు తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదులు వస్తే దాడులకు సిద్ధంగా ఉండాలని ఏసీబీకి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఉన్నతాధికారులు సమావేశమైనట్లు తెలుస్తుండగా ఈ సమావేశంలో న్యాయపరమైన ఇబ్బందులపైనా చర్చించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడటం, లంచాలు అడగటం చేస్తే, నిరభ్యంతరంగా ఏసీబీకి ఫిర్యాదు చేస్తే, వాళ్ళ తాట తీస్తారు