హుదూద్ తుపాను నేర్పిన పాఠాలతో ఏపీ ట్రాన్స్‌కో మరింత అప్రమత్తమై తిత్లీ తుపానును సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది. తిత్లీ తుపానుతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను సకాలంలో మెరుగుపరచగలిగింది. తిత్లీ తుపాను సమయంలో 160 కిలోమీటర్ల వేగంతో వీచిన భారీ ఈదురుగాలులతో శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. ముఖ్యంగా టెక్కలి, పలాస తదితర ప్రాంతాల్లో ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన భారీ విద్యుత్ టవర్లు నేలకొరిగాయి. దీనిని పూర్తిస్థాయిలో మెరుగుపరిచేందుకు వీలుగా అమెరికా నుంచి తీసుకువచ్చిన టవర్లను ఏపీ ట్రాన్స్‌కో ఏర్పాటు చేయగలిగింది. ప్రతి ఏడాది అక్టోబర్‌లో ఎదురయ్యే వరుస తుపాన్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏపీ ట్రాన్స్‌కో ముందస్తు ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా హుదూద్ తుపానుతో విశాఖ జిల్లాలోనే దాదాపు 60 భారీ విద్యుత్ టవర్లు నేలకొరిగాయి. వీటన్నింటినీ తొలగించి తాత్కాలిక టవర్లను యుద్ధప్రాతిపదికన నిర్మించగలిగింది. ఆ తరువాత భారీ టవర్లను ఏర్పాటు చేయగలిగింది. దీనిని గుణపాఠంగా తీసుకున్న ఏపీ ట్రాన్స్‌కో అప్పటి నుంచి ఎంతటి తుపాన్లనైనా అత్యంత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన భారీ విద్యుత్ టవర్లను సమకూర్చుకునే ప్రయత్నాలను సాగిస్తూన ఉంది. 2015నుంచి చేస్తున్న ఫలితాలు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో ఒక్క అమెరికాలోనే భారీ తుపాన్లను సైతం ఎదుర్కొనే విధంగా విద్యుత్ టవర్లను తయారు చేస్తున్నట్టు తెలుసుకోగలిగింది. దీంతో ప్రభుత్వ అనుమతితో అర్డర్లు ఇవ్వడం ఆ తరువాత కొన్నాళ్ళకే ఆంధ్ర రాష్ట్రానికి అవసరమైన భారీ విద్యుత్ టవర్ల ప్రతిపాదనలను పంపించింది. ఇందులోభాగంగా తొలి దశలోనే ఏపీకి 20 భారీ విద్యుత్ టవర్లు మంజూరయ్యాయి. వీటికి రూ.35 కోట్లకు పైగానే ట్రాన్స్‌కో వెచ్చించాల్సి వచ్చింది. ఇందులో పదింటిని విశాఖ జిల్లాకు, మరో పదింటిని నెల్లూరు జిల్లాకు కేటాయించింది. ఈ విధంగా సమకూర్చుకున్న ఏపీ ట్రాన్స్‌కో ఊహించని విధంగా గత నెలలో తిత్లీ తుపానును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ట్రాన్స్‌కో దాదాపు నెల రోజులపాటు శ్రీకాకుళం జిల్లాలోనే మకాం వేసి టవర్లు, విద్యుత్ భారీ లైన్ల విధ్వంసాన్ని అంచనా వేసింది. ఇందులో టెక్కలి, పలాస ప్రాంతాల మధ్య ప్రధానమైన మూడు భారీ విద్యుత్ టవర్లు నేలకోరగడంతో వీటిని తొలగించి అమెరికా నుంచి తీసుకువచ్చి విశాఖలో అందుబాటులో ఉంచిన పదింటిలో మూడు టవర్లను నెలకొల్పగలిగింది. అలాగే మరికొన్నిచోట్ల నేలకొరిగిన మరికొన్నిచోట్ల తాత్కాలిక టవర్లను నిర్మించడం ద్వారా విద్యుత్ సరఫరాను సకాలంలో మెరుగుపర్చగలిగింది. సముద్రతీర ప్రాంతాల సమీపంలో ఉండే సబ్‌స్టేషన్ల వద్ద విలువైన పరికరాలు తుక్కు పట్టకుండే ఉండేందుకు వీలుగా ప్రత్యేక కోటింగ్ వ్యవస్థను పటిష్టపరుస్తున్నామన్నారు. విశాఖ జిల్లా కలపాక విద్యుత్ సబ్‌స్టేషన్‌లో చేసిన ప్రయోగం విజయవంతమైందని, దీనివల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలను అధిగమించడంతోపాటు సాంకేతికపరమైన లోపాలను ఎదుర్కోగలుగుతున్నామన్నారు