YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పట్నాయక్ పట్టు కోసం... ప్రయత్నం

పట్నాయక్ పట్టు కోసం... ప్రయత్నం
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఒడిశా ముఖ్యమంత్రిగా ఐదో సారి పగ్గాలు అందుకునేందుకు అన్ని రకాలు వ్యూహాలు పన్నుతున్నారు. తాజాగా మహిళా రిజర్వేషన్లు బిల్లు శాసనభలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపడం వెనక కూడా నవీన్ ముందుచూపుతోనే వ్యవహరించారంటున్నారు. 33 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పించాలంటూ నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఇటీవల శాసనసభలో తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపింది. మహిళ ఓటర్లను టార్గెట్ గా చేసుకుని ఈ తీర్మానాన్ని నవీన్ ఎన్నికలకు ముందు తెరపైకి తేవడం విశేషం.నవీన్ పట్నాయక్ ఇన్నిసార్లు విజయాన్ని అందుకోవడానికి ముఖ్య కారణం ఆయన ఎన్నికలకు ముందు అనుసరిస్తున్న వ్యూహాలే కారణమని చెబుతున్నారు. ప్రతి ఎన్నికలలోనూ ఏదో ఒక అంశాన్ని హైలెట్ చేయడం, ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా చూసుకోవడంతో నవీన్ ఎన్నికలలో సునాయాసంగా విజయం సాధిస్తున్నారు. అయితే ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఎక్కువగానే ఉండటంతో ఇప్పటి నుంచే నవీన్ పార్టీ బిజూ జనతాదళ్ ఒడిశాలో యాత్రలను కూడా ప్రారంభించింది. ప్రజాసమస్యలను తెలుసుకోవడం, దానికి పరిష్కారాలను అక్కడకక్కడే సూచించడం ఈ యాత్రల లక్ష్యం.18 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక వ్యూహంతోనే ముందుకు వెళుతూ అప్రతిహతంగా విజయాలను అందుకుంటున్నారు. మొత్తం 147 స్థానాలున్న ఒడిశాలో ఈసారి అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు కుదేలైపోయింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఒడిశాలో నిలదొక్కుకుంది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనం. బీజేపీ ఒడిశాలో బలోపేతం అవుతుండటంతో దానిని అడ్డుకునేందుకు నవీన్ అన్ని చర్యలు చేపడుతున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కూడా ఎన్నికలకు ముందు హైలెట్ చేసింది భారతీయ జనతా పార్టీని ఇరకాటంలోకి నెట్టడానికే నంటున్నారు. ఇప్పటికే బిజూ జనతాదళ్ స్థానిక సంస్థల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించింది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన చట్టాన్ని చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. అందుకే నవీన్ తెలివిగా ఈ బిల్లును తేవాలంటూ తీర్మానం చేసి మరీ పంపారు. విపక్షాలు మాత్రం ఈ తీర్మానంపై మండిపడుతున్నాయి. నవీన్ కావాలనే ఎన్నికలకు ముందు ఈ బిల్లు తెచ్చారంటూ విమర్శలకు దిగుతున్నాయి. ఒడిశాలో మహిళలను ఆకట్టుకునేందుకు నవీన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది

Related Posts