రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కొత్త నిబంధనలు బ్యాంక్ లకు గుది బండలుగా మారనున్నాయి. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎటిఎం లను బ్యాంక్ లు మూసేయక తప్పని పరిస్థితి ఎదురైందని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనలను అనుసరిస్తే ఒక్కో ఎటిఎం పైనా బ్యాంక్ లు మూడు లక్షల రూపాయల మేరకు ఖర్చు చేయాలిసి ఉందని అంటున్నారు. అంత మొత్తాన్ని భరించి సాఫ్ట్ వేర్ లను మార్చే ఆర్ధిక స్థితి లో అత్యధిక బ్యాంక్ లు లేవు. ఒక్కో ఎటిఎం ఒక్కరోజు లావాదేవీలు కనీసం వెయ్యి వరకు జరిగితే బ్యాంక్ లకు నష్టం వాటిల్లదు. ఆ స్థాయిలో లావాదేవీలు నడిచేవి నగరాల్లో మాత్రమే కావడంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వీటికి కాలం చెల్లె పరిస్థితి దాపురించింది.దేశంలో పెద్ద నోట్ల రద్దు తరువాత భారత ఆర్ధిక వ్యవస్థ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. సామాన్యులు నగదు లావాదేవీలు నిర్వహించడంలో అవస్థలపాలయ్యారు. ఇప్పటికి ఏ ఎటిఎం లో డబ్బు ఉంటుందో ఎక్కడ ఉండదో తెలియని పరిస్థితినే ఖాతాదారులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా చాలామంది డిజిటల్ లావాదేవీలకు నెమ్మదిగా అలవాటు పడుతున్నప్పటికీ నగదు లావాదేవీలు భారీ ఎత్తునే సాగుతున్నాయి. డబ్బులు నిల్వ చేసిన ఎటిఎం ల ముందు బారులు తీరి మరీ నగదు విత్ డ్రా చేస్తున్నారు ప్రజలు. ఇలాంటి నేపథ్యంలో నిర్వహణ భారం కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ కారణంగా మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఎటిఎం లు పెద్ద సంఖ్యలో మూసివేతకు గురయితే జనం ఇక్కట్లు ఇక చెప్పాలిసిన పని ఉండదు.దేశంలోని ప్రస్తుత ఎటిఎం ల వ్యవస్థ సాఫ్ట్ వేర్ ఎప్పుడో రూపొందించిన విండోస్ ఓల్డ్ సాఫ్ట్ వేర్ తో నడుస్తుంది. ఈ సాఫ్ట్ వేర్ పై హ్యాకింగ్ చేసే అవకాశాలు మెండుగా ఉండటంతో ఆర్బీఐ అప్రమత్తమై బ్యాంక్ లకు తమ సాఫ్ట్ వేర్ మార్చుకోవాలని ఆదేశించింది. ఒక్కో ఎటిఎం పై మూడు లక్షల రూపాయలు వెచ్చించడం అంటే ప్రతి బ్యాంక్ కి అది భారమే. కనుక తమకు లాభాలు తెచ్చే ఎటిఎం యంత్రాలను మాత్రమే ఉంచి మిగిలినవి ఎత్తేయాలని బ్యాంక్ లు లెక్కలు పరిశీలిస్తున్నాయి. ఈవిధంగా ప్రస్తుతం వున్న వాటిలో ఎటిఎం లు మూసేస్తే అనేకమంది ఉపాధి లేక రోడ్డున పడే ప్రమాదం కూడా పొంచి వుంది. కానీ ఆధునిక సాంకేతికత తెచ్చిన పరిణామ క్రమంలో తాజా చర్యలు తప్పనిసరి కావడంతో ఎటిఎం లను నమ్ముకున్న ఖాతాదారులు, వాటిపై ఆధారపడి ఉద్యోగాలు చేసే వారు ప్రత్యామ్నాయ వ్యవస్థలకు మళ్లేందుకు ఇప్పటినుంచి సిద్ధం కాక తప్పదు మరి