తెలంగాణపై బీఎస్పీ మినహా మిగిలిన పార్టీలు పెద్దగా దృష్టి సారించలేదు. గతంలో మాయావతి నగరంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈసారి అన్ని పార్టీల అధినేతలు తెలంగాణపై నజర్ పెట్టారు. త్వరలోనే వీరంతా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. బీఎస్పీ నుంచి మాయావతితో కలిపి 40 మంది, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్, ఎస్‌పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తోపాటు 11 మంది జాతీయ నాయకులు, జనతాదల్ (యునైటెడ్) కోసం బిహార్ సీఎం నితీశ్‌కుమార్, కేసీ త్యాగితో పాటు 20 మంది అగ్రనేతలు, ఆప్ నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మరో ఐదుగురు ఢిల్లీ మంత్రులు ప్రచారం చేయనున్నారు. ఇక సీపీఎం ప్రచారానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ రానున్నారు. బృందాకారత్ ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఎంఐఎం, సీపీఎం, సీపీఐ, తెలంగాణ జనసమితి (టీజేఎస్) సహా పలు జాతీయ పార్టీలు ఈ దఫా తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచాయి. తృణమూల్ కాంగ్రెస్ మాత్రం పోటీకి దూరంగా ఉంది. ఇవికాక ఉత్తర భారతం కేంద్రంగా గల పలు పార్టీలూ తెలంగాణలో రెండు, మూడు దశాబ్దాలుగా పోటీ చేస్తున్నాయి. ఈ పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గెలిచిన దాఖలాలు ఒకటి రెండు ఉన్నాయి. గతంలో వివిధ పార్టీల నాయకులు టికెట్ దక్కకపోతే.. రెబల్ లేదా స్వతంత్రంగా పోటీచేసేవారు. కానీ, 2004 నుంచి పరిస్థితి మారింది. వీలుంటే ఏదో జాతీయ లేదా చిన్న పార్టీ నుంచి పోటీచేసి విజయం సాధిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఉత్తర భారతానికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్), శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, జనతాదళ్ (యునైటెడ్) బరిలో నిలిచాయి. టికెట్ రాక భంగపడ్డ నేతలంతా ఈ పార్టీల నుంచి పోటీకి దిగారు. వీరంతా ఆయా పార్టీల ప్రముఖులను ప్రచారానికి రప్పించి.. తమ ప్రభావాన్ని చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.