కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 25 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఎక్కువ మంది పాఠశాల చిన్నారులే ఉండటం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మాండ్య నుంచి పాండవపుర వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు కనగణమరడి గ్రామంలో అదుపుతప్పి కావేరీ నది వీసీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పాఠశాల విద్యార్థులు సహా 25 మంది మృతిచెందారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొందరిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. కాలువలోకి దూసుకెళ్లగానే బస్సు పూర్తిగా మునిగిపోయింది. దీంతో చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఘటన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.